Oct 09,2023 20:24
  • చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరామతి బ్యూరో : ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌసల్య యోజన పథకం కుల వృత్తిదారులందరికీ ఇవ్వాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ మన్నూరు భాస్కరయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం బాలోత్సవ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కౌసల్య యోజన పథకం ద్వారా రూ.13 వేలకోట్లను రుణం రూపంలో వృత్తిదారులకు ఐదుశాతం వడ్డీతో ఇవ్వడం వృత్తిదారులను మోసగించడమేనని అన్నారు. బిసిలు, వృత్తిదారులపై ప్రధానికి ఉన్న శ్రద్ధ దీంతో అర్థమవుతుందన్నారు. ఈ పథకం రాష్ట్రంలో కేవలం 2.50 లక్షల మందికి మాత్రమే అమలవుతోందన్నారు. చేనేత కార్మికులకు మహాత్మా గాంధీ బంకరా యోజన ఇన్సూరెన్స్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం తగదన్నారు. విదేశీ మారక ద్రవ్యంలో ఇప్పటి వరకు రావాల్సిన రూ.4,288 కోట్లు మత్స్య కార్మికుల అభివృద్ధికి కేటాయించాల్సి ఉండగా, మోడీ ప్రభుత్వం కేవలం రూ.2,144 కోట్లు మాత్రమే కేటాయించినట్లు పేర్కొన్నారు. చేతి వృత్తిదారుల మార్కెటింగ్‌ సౌలభ్యం కోసం 50 శాతం సబ్సిడీతో రుణం మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశ్వకర్మ కౌలస్య యోజన పథకం కింద 50 శాతం సబ్సిడీతో రుణాలివ్వాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, కల్లుగీత సంఘం నాయకులు వి రామచంద్రరావు, రజక సంఘం నేత కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.