May 03,2023 15:30

లక్నో: లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ ఐపిఎల్‌ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో రాహుల్‌ మైదానంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. బెంగళూరు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో డుప్లెసిస్‌ ఎక్స్‌ట్రా కవర్స్‌ వైపు కొట్టిన బంతిని ఆపే క్రమంలో రాహుల్‌ గాయపడ్డాడు. అతడి కుడి తొడ పట్టేయడంతో మైదానంలో కూప్పకూలిన రాహుల్‌.. ఫిజియో సహాయంతో స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్‌ పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే, కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం లక్నో జట్టుతోనే ఉన్నాడని బిసిసిఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. రాహుల్‌కు ముంబయిలో స్కానింగ్‌ పరీక్షలు జరుగుతాయని, రాహుల్‌తోపాటు జయదేవ్‌ ఉనద్కత్‌ పరిస్థితిని కూడా బిసిసిఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక బుధవారం చెన్నైతో మ్యాచ్‌ సందర్భంగా టాస్‌కు కేఎల్‌ రాహుల్‌ బదులు కృనాల్‌ పాండ్యా వచ్చాడు. దీంతో అతడు ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.