మరణ యాతన అనుభవిస్తున్నా.. కనికరం ఉండదా?
ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుల కుటుంబ సభ్యుల ఆవేదన
రాజకీయ ఖైదీలను విడుదల చేయండి : సిపిఎం డిమాండ్
ముంబయి : జైళ్లు నరక కూపాల్లా మారాయని, తీవ్ర అనారోగ్యంతో కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా వారాల తరబడి సరైన వైద్యం అందించడం లేదని రాజకీయ ఖైదీల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్గార్ పరిషత్ - మావోయిస్టు సంబంధాల కేసులో అరెస్టయిన వారికి సకాలంలో సరైన వైద్య సహాయం అందించడం లేదని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైలు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో అరెస్టయిన వెర్నాన్ గాన్‌సల్వేస్ వైద్య చికిత్సలో జైలు అధికారులు 'నేరపూరిత నిర్లక్ష్యం'తో వ్యవహరించారని పేర్కొన్నారు. ఇటీవలే వెర్నాస్‌ను ముంబయిలోని జెజె ఆసుపత్రిలో చేర్చారు. డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆధారపడి ఉన్నారు. గాన్‌సల్వేస్‌కు ఆగస్టు 30న జ్వరం సోకి, పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నా సుమారు వారం రోజుల పాటు సరైన వైద్యం అందించకుండా జైలులో ఉంచారని ప్రకటనలో బంధువులు విమర్శించారు. ఈ నెల 7న ఆసుపత్రికి తీసుకొచ్చినా చికిత్స కొనసాగించడానికి బదులుగా మళ్లీ జైలులోకి తీసుకెళ్లారని, దీంతో అతని న్యాయవాది, భార్య కోర్టును ఆశ్రయించడంతో చివరికి జెజె ఆసుపత్రిలో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అనేక కేసుల్లో నిందితులకు వైద్య సహాయం అందక మరణిస్తున్న సంఘటనలు జరుగుతున్నా జైలు అధికారుల పనితీరులో మార్పు లేదని విమర్శించారు. ఫాదర్ స్టాన్ స్వామి, 33 ఏళ్ల ఆదివాసి పాండు నరోటే మరణాలను జైళ్లలో పరిస్థితికి ఉదాహరణగా పేర్కొన్నారు. వరవరరావు పట్ల జైలులో అమానవీయంగా ప్రవర్తించారని, వృద్ధాప్యం, తీవ్రమైన అనారోగ్యం ఉన్నా సరైన వైద్య చికిత్స అందించలేదని గుర్తుచేశారు. చివరికి సుప్రీంకోర్టు నుంచి వరవరరావుకు మెడికల్ బెయిల్ లభించిందని తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన ఇతర వ్యక్తులకు కూడా జైలు అధికారులు సరైన వైద్య చికిత్సకు నిరాకరిస్తున్నారని ఆరోపించారు. గౌతమ్ నవలఖా, డాక్టర్ హనీబాబు వంటి 'రాజకీయ ఖైదీల'కు సత్వర చికిత్స అందేలా జైళ్ల అధికారుల పనితీరులో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా అండర్ ట్రయల్‌గా జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జైలులో ఉన్న రాజకీయ ఖైదీల భద్రత, రక్షణకు ప్రభుత్వం హామీ ఇవ్వలేకపోతే, వీరికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టులు జోక్యం చేసుకోవాలని, తద్వారా వారి విలువైన జీవితాలు రక్షించినట్లవుతుందని ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన వారి బంధువులు పేర్కొన్నారు.
నేరపూరిత నిర్లక్ష్యాన్ని వీడండి : సిపిఎం
అభియోగాలు రుజువుకాకుండా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. జైళ్లలో వారి పట్ల నేరపూరిత నిర్లక్ష్యాన్ని వెంటనే నిలిపివేయాలని కోరింది. యుఎపిఎను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.










