- చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు : యనమల
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి:దోపిడీ వ్యవస్థకు జగన్ అధిపతి అని, యువతను దెబ్బతీయడమే జగన్ క్రిమినల్ ఆలోచన అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లోకేష్ బస వద్ద ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. సిఐడిని జేబు సంస్థగా మార్చుకుని తప్పుడు ఆరోపణలతో మచ్చలేని చంద్రబాబును అరెస్టు చేశారని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రానికి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైల్లో పెట్టినందుకు ప్రజలే స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్నారని చెప్పారు. తక్కువ ఖర్చుతో సీమన్స్ సంస్థ ద్వారా పేద యువతకు ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగాలస్తాయన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తండ్రి అధికారంతో వేలకోట్లు జగన్ దోచుకున్నట్లు తాము గతంలోనే నిరూపించామని అన్నారు. దొంగకు తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో జగన్ సిఎం కాకముందే చూపించారని, రూ.43 వేల కోట్ల ఆస్తులను సిబిఐ అటాచ్ చేసిందని గుర్తు చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి ఏ విధంగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. ఎటువంటి అక్రమ కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు.










