జగన్ ప్రభుత్వం భూఅక్రమాలకు తెరలేపింది : రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు
ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : చరిత్రలో నిలిచిపోవాలంటే ఫొటో ప్రచారం కాదని అభివృద్ధి ప్రజా సంక్షేమంతోనే సాధ్యమని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. శుక్రవారం మండలంలోని పెనికేరులో టిడిపి నేతలు, కార్యకర్తలతో పార్టీ సభ్యత్వాలు, ఓటర్ల జాబితా ముసాయిదాపై ఆయన శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సత్యానందరావు వైసిపి ప్రభుత్వ పనితీరుపై పలు విమర్శలు చేశారు. బండారు సత్యానందరావు విలేకరులతో మాట్లాడుతూ ... భూహక్కు పత్రాలపై, పాస్ పుస్తకాలపై, పొలాల్లోని సరిహద్దు రాళ్లపై కూడా జగన్ ఫోటోలు ఉండాలనడం అవివేకమని అన్నారు. రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వడమనేది దశాబ్దాల కాలం నుంచి అమల్లో ఉందని, ఇప్పుడు కొత్తగా జగన్ ఫోటో వేసి పాస్ పుస్తకాలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి భూకబ్జాలకు పాల్పడేందుకే భూముల రీసర్వే చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సర్వే సరిహద్దుల చట్టం 1921, భూ హక్కుల చట్టం 1971, రీసర్వే అండ్ ల్యాండ్ రిజిష్టర్‌ను చాలాసార్లు సవరణ చేశారని, జగన్ ప్రభుత్వం భూఅక్రమాలకు తెరలేపిందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అంటే ఏమిటని అడిగారు. ప్రజల భూములపై జగన్‌మోహనరెడ్డి హక్కుగా భావించి, యాజమాన్య హక్కులను మార్చే అధికారం వారికి ఎవరిచ్చారని, ప్రభుత్వ తీరు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో గొడవర్తి భాసకరరావు, కోన దత్తుడు, గుడాల ప్రభాకర్, కుడిపూడి వెంకట్రావు, కొమ్ము నారాయుడు, వాసాది శ్రీనివాస్, చొల్లంగి శ్రీనివాస్, కోట గోవిందు, కర్రీ బ్రహ్మాజీ, గోపు కృష్ణమూర్తి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










