Jul 06,2023 21:03
  • స్కాట్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు

హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌ జట్టు మరోసారి అర్హత సాధించింది. బులవాయోలోని క్వీన్స్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో జరిగిన హోరాహోరీ పోరులో నెదర్లాండ్స్‌ జట్టు 4వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై గెలిచి 1996 తర్వాత మరోసారి వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది. స్కాట్లాండ్‌ నిర్దేశించిన 278పరుగుల లక్ష్యాన్ని 44ఓవర్ల ఛేదిచాల్సి ఉండగా.. 42.5ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ జట్టు కొట్టింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 277పరుగుల భారీస్కోర్‌ చేసింది. మెక్‌ ముల్లన్‌(106), కెప్టెన్‌ బెర్రింగ్టన్‌(64) బ్యాటింగ్‌లో రాణించారు. లీడేకు ఐదు, క్లెన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో నెదర్లాండ్స్‌ జట్టు 108పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా.. లీడే(123; 92బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో నెదర్లాండ్స్‌ జట్టు 42.5ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 278పరుగులు చేసి విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచిన లీడేకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో నెదర్లాండ్స్‌, జింబాబ్వే, స్కాట్లాండ్‌ జట్లు సూపర్‌-6లో 6పాయింట్లతో సమంగా ఉన్నాయి. శ్రీలంక జట్టు 8పాయింట్లతో (+1.817) రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. నెదర్లాండ్స్‌ జట్టు 6పాయింట్లతో (+0.230) రన్‌రేట్‌తో రెండోస్థానంలో నిలిచింది. ఇక స్కాట్లాండ్‌ 6పాయింట్లతో (+0.102), జింబాబ్వే 6పాయింట్లతో (-0.099)తో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. శ్రీలంక-వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం నామమాత్రపు సూపర్‌-6 మ్యాచ్‌ జరగనుండగా.. ఆదివారం నెదర్లాండ్స్‌-శ్రీలంక జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.