Jul 02,2023 15:40

ఖమ్మం : ఖమ్మం కాంగ్రెస్‌ జనగర్జన సభకు బీఆర్‌ఎస్‌ అనేక అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్‌ జనగర్జన సభ జరగనుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ సభకు వస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, కాంగ్రెస్‌ జనగర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సఅష్టించడం కరెక్ట్‌ కాదని అన్నారు. రాహుల్‌ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడం ఏంటి? కేసీఆర్‌ కు చెప్పేదొక్కటే ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు నిర్వహించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. డబ్బులు కడతామన్నా ఆర్టీసీ బస్సులను ఇవ్వలేదని, జనం ప్రైవేటు వాహనాల్లో సభకు వెళుతున్నా అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ''ఎక్కడ మీటింగులు జరిగినా ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవడం సాధారణంగా జరిగే విషయమే. కానీ కాంగ్రెస్‌ జనగర్జన సభకు భయపడిన రాష్ట్ర ప్రభుత్వం బస్సులను ఇవ్వడంలేదు. ఇతర వాహనాలను కూడా ఆపేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలిస్తున్నారు. ఇలా కక్ష గట్టి మరీ జనాన్ని కాంగ్రెస్‌ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే సభను సజావుగా నడిపేందుకు పోలీసులకు తగిన సూచనలు చేయాలి. లేకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది'' అని కోమటిరెడ్డి హెచ్చరించారు.