Dec 18,2022 11:04

నటి ప్రేమ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. మాతృభాష కన్నడలో కెరీర్‌ ప్రారంభించి.. శివరాజ్‌ కుమార్‌, విష్ణువర్థన్‌, ఉపేంద్ర, రమేష్‌ అరవింద్‌ లాంటి స్టార్‌ హీరోల పక్కన నటించారు.. కన్నడలో పలు చిత్రాలు చేసి పేరు తెచ్చుకున్నారు.. మొదట్లో హీరోయిన్‌గా ఎక్కువ చిత్రాలు చేసినప్పటికీ ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్‌ తీసుకుని తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఇటీవలే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో వచ్చిన 'అనుకోని ప్రయాణం' లో చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గురించి పంచుకున్న మరిన్ని విశేషాలు...

పేరు : ప్రేమ
అసలు పేరు : నెరవంద చెంగప్ప ప్రేమ
పుట్టిన తేదీ : జనవరి 6, 1977
పుట్టిన ప్రాంతం :కూర్గ్‌, కర్నాటక
నివాస ప్రాంతం : బెంగళూరు
తల్లిదండ్రులు : చెంగప్ప, కావేరి
తోబుట్టువులు : నెరవంద అయ్యప్ప, ఇందు ఎన్‌సి

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్‌ చిత్రాల్లో నటించారు. ఆ క్యారెక్టర్లు ప్రేమకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక అప్పట్లో గ్లామర్‌ పాత్రలను చేస్తూ భారీగా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఏర్పరచుకున్నారు ప్రేమ. కాగా ప్రేమ, విక్టరీ వెంకటేష్‌ నటించిన 'ధర్మచక్రం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. మొదటి చిత్రంతోనే భారీ క్రేజ్‌ను ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆమె నటించిన 'కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్‌, దేవి, దీర్ఘసుమంగళీభవ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె 2006లో ప్రముఖ వ్యాపారవేత్త జీవన్‌ అప్పచును ప్రేమ వివాహం చేసుకున్నారు. తన వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యల వల్ల పరస్పర అంగీకారంతో వారు విడాకులు తీసుకున్నారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నేళ్లపాటు ఆమె నటనకు దూరమయ్యారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో 'అనుకోని ప్రయాణం' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
 

                                                            ఒక్క డైలాగ్‌కి 15 టేక్స్‌ తీసుకున్నా...

'నేను పుట్టి పెరిగింది అంతా బెంగుళూరే. సినిమాలో నటించడం కోసం మద్రాసు వెళ్లాను. 'ఓం' సినిమా తెలుగులో నటించడం కోసం మద్రాసు వెళ్లాను. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది మాత్రం కన్నడ సినిమా కోసమే. ఆ సినిమాలో శివరాజ్‌కుమార్‌ హీరో. ఆ సినిమా టైంలో 15 టేక్స్‌ తీసుకున్నా డైలాగ్‌ చెప్పడం రాలేదని దర్శకుడు నన్ను తిట్టారు. మా అమ్మ కూడా ఎందుకు చెప్పలేవు కాస్త శ్రద్ధ పెట్టమని తిట్టింది. అంతే కోపం వచ్చి వెళ్లి చెప్పా.. వెంటనే ఓకే అయింది' అని చెప్పారు ప్రేమ.
 

                                                                    ఆ సాంగ్‌ ఇప్పటికీ నా ఫేవరెట్‌..

ఇప్పటి వరకూ నేను 100కు పైగా చిత్రాల్లో చేశాను. నా హైట్‌ వల్ల కొంతమంది హీరోలు ఇబ్బంది పడ్డారు. కానీ కెమెరా ట్రిక్స్‌ ఉపయోగించి షూటింగ్‌ చేసేవారు. 'తొట్టెంపూడి వేణు హీరోగా వచ్చిన 'చిరునవ్వుతో' సినిమాలో కథలో కీలకంగా ఉంటూ, ఆడియన్స్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే క్యారెక్టర్‌ చేశాను. నా రోల్‌కి మంచి పేరు వచ్చింది.. నాకు ఆ పాత్ర చాలా నచ్చింది. అందులో ఒక సెంటిమెంట్‌ ఉంటుంది అందుకే అంగీకరించా. నేను ఆ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూసినప్పుడు ప్రేక్షకులు నా పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యారు. చాలా ఆనందం వేసింది. అందులో 'సంతోషం.. సగం బలం.. హాయిగ నవ్వమ్మా' సాంగ్‌ ఇప్పటికీ నా ఫేవరెట్‌.. చాలా అర్థం ఉంటుంది ఆ పాటలో. కోడి రామకృష్ణగారి వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను. ఆయన సినిమాల్లో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్‌ ఉండేవి. వాటి కోసం నేర్చుకున్నా. చిరునవ్వు చిత్రం తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాను' అని చెప్పుకొచ్చారు..
 

                                                                 కొన్ని షాట్స్‌ భయపడుతూనే చేశా..

'తెలుగులో నేను నటించిన వాటిల్లో డివోషనల్‌ పాత్రలే ఎక్కువ.. థియేటర్‌కు వచ్చే జనాలు కూడా మనల్ని చూసి అచ్చం దేవతలానే ఉన్నారనుకోవాలి. దేవతలా నటించాలంటే ముఖంలో ప్రశాంతత ఉండాలి. తలపైన కిరీటం ఉంటుంది. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడను. యాక్షన్‌ అని చెప్పగానే కెమెరా, నేను అంతే అనుకుంటా. 'దేవి' సినిమా చేసేటప్పుడు నేను దేవతలా ఫీల్‌ అయ్యా.. అది అనుకోకుండా వచ్చేస్తుంది. చాలా సార్లు పాములతో కూడా నటించా. నాగదేవత సినిమాలో పామును మెడలో వేసి రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వమన్నారు. భయపడుతూనే చేశాను. ఓకే అయ్యింది షాట్‌. సాయికుమార్‌గారు నేను చూడలేను అని వెళ్లిపోయారు (నవ్వుతూ). నాకు వ్యక్తిగతంగా కుటుంబ తరహా పాత్రలు అంటే ఇష్టం' అని చెప్పుకొచ్చారు.