భువనేశ్వర్ / న్యూఢిల్లీ : ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మూడు రైళ్లు ఒకేచోట ఒకదానికొకటి ఢకొీనడం దిగ్భ్రాతి కలిగిస్తోంది. ప్రత్యక్ష సాక్షులు, వివిధ వార్తా సంస్థల విశ్లేషణల ఆధారంగా ప్రమాదం జరిగిన తీరు ఈ విధంగా ఉంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ ఒక గూడ్స్ రైలును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే పరిభాషలో దీన్ని 'హెడ్ ఆన్ కొలీజన్' అంటారు. ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో కొన్ని పక్కనున్న ట్రాక్‌పైకి దొర్లాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. పట్టాలు తప్పి పక్కనున్న ట్రాక్ మీదికి దొర్లిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పెట్టెలు... అప్పుడే దానిపై వెళ్తున్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢకొీన్నాయి. దాంతో ఈ ప్రమాదం మరింత భయంకరంగా మారింది. ఈ ప్రమాదం సౌత్ ఈస్ట్రన్ జోన్‌లోని ఖరగ్‌పూర్ డివిజన్ బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌పైన జరిగింది.
ప్రమాదం జరిగిన క్రమం..
- శుక్రవారం, జూన్ 2న హౌరాకు దగ్గరలోని షాలీమార్ స్టేషన్ నుంచి రైలు నంబరు 12841 షాలీమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయానికే బయలుదేరింది.
- 23 బోగీలు ఉండే ఈ రైలు అప్‌లైన్‌లో బాలాసోర్, కటక్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడల మీదుగా చెన్నై చేరుకోవాలి.
- మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు రైలు బయలుదేరింది. ముందుగా అది సంత్రాగాఛీ రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఆ తర్వాత, కేవలం 3 నిమిషాల ఆలస్యంతో ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.
- సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఈ రైలు ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది.
- సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ దగ్గరుండే బాహానగా బజార్ రైల్వేస్టేషన్‌ను సమీపించింది.
- వాస్తవానికి బాహానగాలో ఈ రైలు ఆగదు. అయితే, అది ఈ స్టేషన్‌లో మెయిన్ లైన్ మీదుగా వెళ్లకుండా లూప్ లైన్ వైపు మళ్లింది. అప్పటికే సదరు లూప్ లైన్‌లో ఒక గూడ్స్ రైలు ఆగి ఉంది. చాలా వేగంగా వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ ట్రెయిన్‌ను వెనుక నుంచి ఢకొీట్టింది. అయితే కోరమాండల్ రైలు లూప్ లైన్ వైపు ఎందుకు మళ్లిందనేదీ అంతుచిక్కడం లేదు. ప్రాథమిక విచారణ ఆధారంగా సిగలింగ్ వ్యవస్థ లోపమే ప్రధానకారణంగా కనిపిస్తోంది.
- గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక నుంచి ఢకొీట్టడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులోని కొన్ని బోగీలు డౌన్ లైన్ మీదికి పడిపోయాయి.
- సరిగ్గా అదే సమయంలో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ఈ ప్రమాద స్థలాన్ని దాటుతోంది. 22 బోగీలు ఉన్న ఆ రైలు దాదాపు 4 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలులోని చాలా భాగం ప్రమాద స్థలాన్ని దాటేసి ముందుకు వెళ్లింది.
- అప్పుడే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. దాని బోగీలు కొన్ని పక్కకు దొర్లి యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెనుక భాగాన్ని ఢకొీట్టాయి. దాంతో ఆ ట్రెయిన్‌లో కూడా 3 బోగీలు పట్టాలు తప్పాయి.

రైల్వే నిపుణులేమన్నారు..
కోరమాండల్, యశ్వంతపూర్ రైళ్ల ప్రమాదానికి సాంకేతిక వైఫల్యం, మానవ తప్పిదాలే ప్రధాన కారణాలుగా రైల్వే రంగ నిపుణులు విశ్లేషించారు. సాంకేతిక లోపం కారణంగానే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగల్ ఇచ్చి ఉంటారని, లేదా సాంకేతిక లోపం వల్ల ఈ రైలు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ మీదికి మళ్లి ఉండవచ్చునని అఖిల భారత రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు. అదే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన తీరును చూస్తుంటే, ఇదో భారీ మానవ తప్పిదం అయి ఉంటుందని రైల్వే బోర్డ్ మాజీ సభ్యులు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ పేర్కొన్నారు. ''ఏదైనా రైలు ఒక ట్రాక్ మీద ఆగిపోతే, ఆ ట్రాక్ మీదికి మరో రైలు ఏదీ రాకుండా నిరోధించడానికి పాయింట్ రివర్స్ ఇస్తారు. అలా చేసినప్పుడు ఆ ట్రాక్ మీదికి మరేదీ వెళ్లదు. ఏదైనా సాంకేతిక లోపం వల్ల అలా జరగకపోతే, వెంటనే రెడ్ లైట్ సిగల్ ఇస్తారు. అప్పుడు అటు నుంచి వచ్చే రైలు ఆగిపోతుంది.' అని ఆయన అన్నారు.
వేగమే కొంపముంచిందా..
కాగా ప్రస్తుతం ప్రమాదం చోటుచేసుకున్న మార్గంలో రైళ్ల వేగాన్ని దాదాపు 15 రోజుల కిందే పెంచారని శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు. గరిష్ఠ వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లుగా నిర్ధరించారని ఆయన పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు దాదాపు 128 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని, యశ్వంత్‌పూర్ ట్రెయిన్ దాదాపు 125 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని ఆయన వివరించారు. ఈ వేగం కారణంగానే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు భారీగా నష్టం జరిగిందని తెలిపారు.
మరో గమనించాల్సిన అంశమేమిటంటే ఈ ప్రమాదానికి గురైన రెండు రైళ్లలోనూ జర్మనీలో డిజైన్ చేసిన 'లింకే హాఫ్‌మెన్ బుష్' (ఎల్‌హెచ్‌బి) బోగీలు ఉన్నాయి. ఈ డిజైన్ బోగీలు ప్రమాదాలను తట్టుకునేలా సురక్షితంగా ఉంటాయని చెబుతారు. కానీ రైల్వేకు చెందిన పాత ఐసిఎఫ్ డిజైన్‌తో పోలిస్తే, ఎల్‌హెచ్‌బి కోచ్‌లు ప్రమాదం జరిగినా ఒక దాని పైకి మరొకటి ఎక్కవు. కాబట్టి బోగీలు నుజ్జు నుజ్జయ్యే ప్రమాదం ఉండదు. దాంతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుండదు.
కానీ ఒడిషా ప్రమాదానికి సంబంధించిన ఫొటోల్ని చూసినప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ గూడ్స్ రైలు మీదికి ఎక్కినట్టు కనిపిస్తోంది. ఇంజిన్ వెనుకున్న చాలా బోగీలు ఒకదానితో ఒకటి ఢకొీని నుజ్జునుజ్జయ్యాయి. అందువల్ల ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు సమగ్ర దర్యాప్తు తర్వాతే తేటతెల్లం అవుతాయి.
సిగ్నల్ ఇచ్చారు కానీ...
భువనేశ్వర్ : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి సిగల్ ఇచ్చారని, కానీ వెంటనే వెనక్కి తీసుకున్నారని, ఈలోగా కోరమాండల్ లూప్‌లైన్‌లోకి ప్రవేశించి అక్కడ ఆగి వున్న గూడ్స్ రైలును ఢ కొందని రైల్వే అధికారుల బృందం ప్రాధమిక దర్యాప్తులో తేలింది. సిగల్ ఇచ్చి ఎందుకు వెనక్కి తీసుకున్నారన్న కారణాన్ని ఆ నివేదికలో స్పష్టం చేయలేదు. ఇదిలా వుండగా, సీనియర్ డిప్యూటీ కమర్షియల్ మేనేజర్, సౌత్ ఈస్ట్ రైల్వేస్ ప్రతినిధి రాజేష్ కుమార్ ప్రమాదం జరిగిన తీరును హిందూతో వివరిస్తూ, ''లూప్ లైన్‌లో గూడ్స్ రైలు ఆగి వుంది. గంటకు 130కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కోరమాండల్ లూప్‌లైన్‌లోకి వెళ్ళి అక్కడ నిలిచిన గూడ్స్‌ను వెనక నుండి ఢ కొట్టింది. మెయిన్ లైన్‌లో వెళ్ళేందుకు కోరమండల్‌కు సిగల్ అప్పటికే ఇచ్చారు. అయినా కోరమాండల్ తన దిశ మార్చుకుని ఎందుకు లూప్‌లైన్‌లోకి వెళ్ళిందో తెలియడం లేదు.'' అని చెప్పారు. కోరమండల్ ఇంజన్ మొత్తంగా గూడ్స్ రైలును పైకెత్తేసింది. దీంతో కోరమాండల్‌కి చెందిన 12బోగీలు పట్టాలు తప్పాయి, అదే సమయంలో ఎదురుగా వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అప్పటికే ప్రమాద స్థలిని దాటింది కానీ దాని చివరి రెండు జనరల్ బోగీలను కోరమాండల్ చివరి బోగీలు ఢీకొన్నాయి. దీంతో ఆ జనరల్ బోగీలు దెబ్బతిన్నాయన్నారు.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి. ప్రతిపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటనల్లో నాల్గవదిగా భావిస్తున్న ఈ ఘోర ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు శనివారం డిమాండ్ చేశాయి. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నాయి. జరిగిన ఘోరంపై కాంగ్రెస్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. రైల్వే నిర్వహణలో ప్రయాణికుల భద్రతకే పెద్ద పీట వేయాల్సి వుందని పేర్కొంది. సిపిఎం(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య ట్వీట్ చేస్తూ, ''భారతీయ రైల్వేలో మనకు సిగలింగ్, భద్రతా వ్యవస్థలు లేవా ? లేదా ఇటువంటి మహా విషాదాలు ఇకపై దేశంలో రైల్వే ప్రయాణాల్లో సాధారణం కానున్నాయా? బాధితులకు, వారి కుటుంబాలకు మనం సమాధానం చెప్పాల్సి వుంది.'' అని పేర్కొన్నారు. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని సిపిఐ, ఆర్‌జెడిలు డిమాండ్ చేశాయి. సవివరమైన రీతిలో దర్యాప్తు జరగాల్సి వుందని అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి కె.పళనిసామి పేర్కొన్నారు. ప్రమాద స్థలిని సందర్శించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడుతూ ఈ ఘోర ప్రమాదం వెనుక ఏదో తప్పు జరిగిందని, దానిపై సక్రమంగా దర్యాప్తు జరగాలని కోరారు. ప్రమాదానికి గురైన బోగీల్లో మూడింటిని సోదా చేయలేదని విమర్శించారు.










