ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గోదావరి ముంపు బారిన పడిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను తక్షణం ఆదుకోవాలని సిపిఎం సీనియర్ నేత పి.మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లేఖ ప్రతిని సిసిఎల్‌ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్‌కు పి. మధు అందచేశారు. ఈ సందర్భంగా విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సిపిఎల్‌ఏ హామీ ఇచ్చారు. మూడు పేజీల ఈ లేఖలో ముంపు ప్రాంతాల్లో సిపిఎం బృందం జరిపిన పర్యటన సందర్భంగా వెలుగులోకి వచ్చిన పలు సమస్యలను వివరించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలు రెండు మాసాలుగా వరదలతో అవస్థలు పడుతున్నారని, పనులు లేక, కుటుంబాలు గడవక కష్టాల్లో ఉన్నారని తెలిపారు. నెల రోజుల్లో రెండుసార్లు ఎనిమిది మండలాల్లో వందలాది గ్రామాలు పూర్తిగా నీట మునిగాయని, ప్రజలంతా ఇళ్లను, సామగ్రిని వదిలేసి కొండలపైనా, అడవుల్లోనా తలదాచుకున్నారని, నానా అవస్థలు పడ్డారని తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పని స్వల్పంగానే జరిగిందని వివరించారు. వెంటనే ప్రతి కుటుంబానికీ రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని, పడిపోయిన ఇళ్లకు రూ.20 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ సంవత్సరం వ్యవసాయ సీజన్‌లో వరదల వల్ల వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, పంటలు వేయలేదని, దీనివల్ల ఉపాధి తీవ్రమైన సమస్యగా మారిందని పేర్కొన్నారు. వెంటనే ఉపాధి చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్వాసిత కాలనీల్లో ఉపాధి చర్యలు ప్రత్యేకంగా చేపట్టాలని, అప్పటి వరకూ ప్రతి నెలా కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కోరారు. 1986, 2022లో వచ్చిన వరదలు ప్రామాణికంగా తీసుకుని మొత్తం ముంపు గ్రామాల రీ సర్వే చేయాలని విజ్ఞప్తి చేశారు. పునరావాసం సంపూర్ణంగా పూర్తయ్యే వరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని, ఇటీవల వరదల్లో మునిగిపోయిన పునరావాస కాలనీలకు కూడా ప్రత్యామ్నాయంగా ముంపు లేనిచోట తిరిగి కాలనీలు నిర్మించాలని కోరారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం 25 రకాల మౌలిక సదుపాయాలతో పునరావాస కాలనీలు నిర్మించాలన్నారు. పునరావాస కాలనీల నిర్మాణం పూర్తయ్యి ముంపు గ్రామం అక్కడికి తరలించేనాటికి 18 ఏళ్లు వయసు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, పాత కటాఫ్ తేదీలు రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షలు వెంటనే ఇవ్వాలని, భూమికి భూమి ఇచ్చే ప్రాంతం వ్యవసాయ యోగ్యమైనదిగా, వివాదాలు లేనిదై ఉండాలని సూచించారు. మునిగిపోయే భూమికి ఎకరాకు రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని, గతంలో ఎకరాకు రూ.లక్షా 15 వేలు పరిహారమిచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.5 లక్షలు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ముంపు ప్రాంతంలో చదువుకున్న యువకులకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కోసం స్థానికంగా సంస్థలు ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టులోనూ, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. తక్షణం మునిగిపోతున్న గ్రామాల్లో స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కనీస అవసరాలు పట్టించుకోలేదు..
ముంపు బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించడానికి స్వల్పంగానే కృషి చేశారని, దీంతో బాధితులు కొండలపైనా, అడవుల్లో తలదాచుకున్నారని తెలిపారు. పునరావాస శిబిరాల్లోనూ కనీస అవసరాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. వరద సమయంలో 200 ఎంఎల్ కిరోసిన్ మాత్రమే ఇచ్చారని, రేషన్ కార్డు ఉన్న వారికి ఒక గంటకు సరిపోయే కొవ్వొత్తి, రోజుకొక మంచినీళ్ల ప్యాకెట్ ఇచ్చారని తెలిపారు. అడవిలో కర్రలు తెచ్చుకుని తాత్కాలికంగా గుడిసెలు వేసుకోవడానికి ప్రయత్నించిన వారిపై కేసులు పెడతామని అటవీశాఖ అధికారులు బెదిరించారని పేర్కొన్నారు. వేలాది మంది విష జ్వరాల బారిన పడ్డారని, పలువురు మరణిస్తున్నారని తెలిపారు. ఒక్క కుయిగూరులోనే డెంగ్యూతో ఐదుగురు చనిపోయారని తెలిపారు. చింతూరు ఆస్పత్రిలో ఒకే డాక్టర్ ఉండటంతో కేసులన్నింటిని రాజమండ్రికి రిఫర్ చేస్తున్నారని, దీంతో గత్యంతరం లేక భద్రాచలం వెళ్తున్నారని అక్కడ వైద్యం అందడం లేదని తెలిపారు. పునరావాసం పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడం వల్ల భారీ నష్టం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ముంపు లెక్కలకు, వాస్తవ ముంపునకు పొంతన లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులకు అందచేశారు. పునరావాసం ఐదు శాతమే పూర్తయిందని, అది కూడా 41.15 కాంటూరు పరిధిలోనిదేనని వివరించారు. మిగిలిన వారిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ముంపు బారిన పడిన నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు.










