ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోదావరి వరద బాధిత ప్రజల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో శుక్రవారం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, ఎం.ఏ బేబి హాజరయ్యారు. గోదావరి వరదలు - పోలవరం మునక బాధితులకు సంబంధించిన తీర్మానాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. 'గోదావరికి మళ్లీ వరదలొస్తున్నాయి. జులై 11న వచ్చిన వరదల నుండి ప్రజలు ఇంతవరకు కోలుకోలేదు. ఇప్పటికీ నీళ్ళలోనే గ్రామాలు మునిగి వున్నాయి. ప్రభుత్వ సహాయం అరకొరగా వుంది. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభు త్వం విఫలమైంది. పోలవరం నిర్మాణంలో అవకతవకలు వల్ల మునక పెరిగి ప్రజల బాధలు పెరిగాయి.' అని తీర్మానంలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం తక్షణం బృందాలను పంపి బాధితుల్ని ఆదుకునేందుకు నిధులు విడుదల చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించు కుంటూ పోలవరం ముంపు బాధితులకు పునరావాసం కల్పించకుండా నిలువునా ముంచేస్తున్నారని, కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని పేర్కొంది.
'గోదావరి వరద బాధిత ప్రాంతాలలో నెల రోజులకు పైగా సిపిఎం కమిటీలు, కార్యకర్తలు వరద బాధితులకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోదావరి వరద బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పూర్తి న్యాయం జరిగేదాకా సిపిఎం పూర్తిగా అండదండలను అందిస్తుంది.' అని రాష్ట్ర కమిటీ సమావేశం హామీ ఇచ్చింది. 'పోలవరం ప్రాజెక్టు కింద ఎనిమిది మండలాల్లోని 222 పంచాయితీల్లో 373 గ్రామాలు సంపూర్ణంగా మునుగుతాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ మొత్తం గ్రామాల్లో 1,06,006 కుటుంబాలను నిర్వాసితులుగా తేల్చారు. ఇది చాలా కాలంగా చెబుతున్న లెక్క. కానీ వాస్తవంలో దాదాపు మరో 100 గ్రామాలు పైనే మునుగుతాయని ఇటీవల వచ్చిన వరద రుజువుచేసింది.' అని తీర్మానంలో వివరించారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల విన్నపాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రభుత్వం 45వ కాంటూరులో చేర్చిన గ్రామాలు, అసలు ముంపు జాబితాలో లేని గ్రామాలు కూడా 2019 నుండి వచ్చిన వరదలలో మునిగిపో యాయి. ఆరు విలీన మండలాల్లోని గ్రామాలలో కాంటూరు లెక్కలు తప్పులతడకగా వున్నాయి.
పునరావాసం, పునరావాస ప్యాకేజి పూర్తిగా అమలు జరిపేంతవరకు ఎలాంటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని ప్రజలు, నిపుణులు, న్యాయస్థానాలు తీర్పులు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా, చట్టవిరుద్ధంగా నిర్మాణం చేపట్టాయి. పునరావాసానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా తన బాధ్యత నుండి తప్పించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నిధుల గురించి పోరాడకుండా ఏజెన్సీ ప్రజలను ముంచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వవలసిన ప్యాకేజితో తమకు సంబంధం లేదని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా మాట్లాడుతోంది.' అని తీర్మానంలో పేర్కొన్నారు. 'ఇటీవల వరద బాధిత ప్రాంతాల పర్యటనలో ముఖ్యమంత్రి 41.15 కాంటూరు వరకు మాత్రమే పునరావాసం పూర్తిచేస్తామని ప్రకటించారు. అంటే మిగిలిన గ్రామాలను గాలికి వదిలేస్తారా అని ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వరద బాధిత మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి సహాయ సహకారాలను ప్రకటించలేదు. ఇది చాలా అన్యాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయ, అమానుష వైఖరికి 3 లక్షల నిర్వాసిత ప్రజలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం నానా అటచాట్లు పడుతున్నారు. బాదితుల్లో ఎక్కువగా ఆదివాసీలు వున్నారు' అని వివరించారు. పోలవరం ప్రాజెక్టు, వరద బాధిత మండలాల్లోని ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా సహాయం అందించాలని , పోలవరం నిర్వాసితులతో పాటు, గోదావరి లంక గ్రామాల ప్రజలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
డిమాండ్లు
- కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా 6 విలీన మండలాల్లో, పోలవరం, దేవీపట్నం మండలాల్లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి స్థాయి ప్యాకేజి అమలు జరిపి పునరావాసం కల్పించాలి.
- పూర్తి పునరావాసం కల్పించేలోపు ప్రతి కుటుం బానికి వరద బాధిత సహాయం అందించాలి. ప్రతి కుటుంబానికి నెలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, నిత్యావసర వస్తువులు, మంచినూనె, కిరోసిన్ వగైరా ఇవ్వాలి. కుటుంబ ఖర్చుల నిమిత్తం నెలకు 5 వేల రూపాయలు ఇవ్వాలి.
- రహదారులకు మరమ్మత్తులు చేయాలి. విద్యుత్ తక్షణం పునరుద్దరించాలి.
- వరద నష్టం వెంటనే ఎన్యూమరేషన్ చేయాలి. పూర్తిగా నష్టపోయిన ఇంటికి 6 లక్షలు, పాక్షికంగా నష్టపోయిన ఇంటికి లక్ష మంజూరు చేయాలి.
- తాత్కాలికంగా గుడారాలు, షెడ్లు నిర్మాణానికి సామాగ్రి ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి టార్పాలిన్లు, దోమ తెరలు ఇవ్వాలి.
- అన్ని గ్రామాల్లో సత్వరం పారిశుద్ధ్యం నిర్వహిం చాలి.
- సంచార వైద్యశాలలు, వైద్య శిబిరాలు నిర్వహించాలి.
- పంటలు, పశువులు నష్టం ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం ఇవ్వాలి. పశుగ్రాసం సరఫరా చేయాలి.










