'మహర్షి' చిత్రంలో మహేశ్‌బాబు తన స్నేహితుడైన నరేష్ సమస్యపై పోరాడేందుకు ఓ గ్రామం వెళ్తాడు. అక్కడ ఓ మూగ అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ పిల్లాడితో మహేశ్‌బాబుకు అనుబంధం ఏర్పడుతుంది. ఇక మహేశ్‌బాబు ఊరి నుండి వెళ్లిపోతున్నప్పుడు ఆ బాబు విజిల్ ఊదుతూ ఇక్కడే ఉండిపోవాలని కారు వెంట పరిగెడతాడు. ఆ పిల్లాడి పేరు చక్రి.
'మిర్చి, కృష్ణం వందే జగద్గురుం, ద్వారక, గుంటూరోడు, స్పీడున్నోడు, నేనొక్కడినే, బ్రహ్మోత్సవం, మనం, రోజులు మారాయి, ప్రతి రోజూ పండగే, అఖిల్, అల వైకుంఠపురములో..' వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో బాల నటుడిగా చక్రి నటించాడు. ఇప్పటివరకూ దాదాపు 45కు పైగా చిత్రాల్లో బాల నటుడిగా ఎంతో చక్కగా నటిస్తూ అలరించాడు. అంతేకాదు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌ల మాదిరిగానే వచ్చినప్పటికీ నటనలో తనదైన ముద్ర వేసుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు.
అదే నా కోరిక..
'ఇప్పటి వరకూ చాలా చిత్రాల్లో నటించా. ప్రతి చిత్రం నాకు ఓ మంచి అనుభూతిని పంచింది. అలాగే భవిష్యత్తులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక!' అని బాల నటుడు చక్రి తెలిపాడు. 'మహర్షి చిత్రంలో హీరో మహేష్‌బాబుకు సపోర్ట్‌గా ఉండే బాలనటుడిగా.. మూగవాని పాత్ర చేశాను. ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది!' అని చెప్పాడు చక్రి.
వారిద్దరూ బాల నటులే..
తన లాగే తన అన్న దమ్ములు ఇద్దరూ బాల నటులేనని తెలిపాడు చక్రి. ఈ సందర్భంగా తన గురించి వివరిస్తూ.. 'నేను హైదరాబాద్‌లోని నిజాం పేట శ్రద్ధ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. అన్న విష్ణు చరణ్ 9వ తరగతి చదువుతున్నాడు. తమ్ముడు కృష్ణ చరణ్ 2వ తరగతి చదువుతున్నాడు. విశేషమేమిటంటే విష్ణు చరణ్, కృష్ణ చరణ్‌లు కూడా బాలనటులే. విష్ణుచరణ్ 20 చిత్రాల్లో నటించాడు. కృష్ణచరణ్ రెండు చిత్రాల్లో నటించాడు. నాన్న సతీష్ నాయుడు హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫొటో స్టూడియో ఏర్పాటు చేసుకుని, స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ ధనశ్రీ గృహిణి. తన తండ్రి సొంత ఊరు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట కాగా, తల్లిది ద్వారకా తిరుమల అని చక్రి తెలిపాడు.
అవకాశం ఇలా వచ్చింది..
కాగా తనకు సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయనే విషయంపై వివరిస్తూ.. 'నాన్న స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుండడం వల్ల.. నాన్న మమ్మల్ని ఎక్కువగా ఫొటోలు తీసి, వాటిని ఫేస్బుక్లో పెడుతుండేవాడు. ఆ ఫొటోలు ఒకరోజు బాలనటుల కోసం చూస్తున్న ఓ దర్శకుడి కంట పడ్డాయంట. ఆ ఫొటోలు ఆయనకు బాగా నచ్చడంతో ఆయన చొరవతో మాకు సినిమా ఆఫర్స్ వచ్చాయి' అని చక్రి వివరించాడు. అంతే కాకుండా తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని, మంచి మంచి పాత్రల్లో నటించి, గుర్తింపు తెచ్చుకోవాల నేది తన కోరికని చెబుతున్నాడు. ఆల్ ది బెస్ట్ చక్రి. నువ్వు అనుకున్నట్లే ఎదగాలి.