- వ్యక్తిగత కారణాలతో కమిన్స్ ఆసీస్‌కు పయనం
- ఫిట్‌నెట్ సాధించిన గ్రీన్, స్టార్క్
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆసీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఆసీస్‌కు పయనం కాగా.. గాయం తీవ్రత తగ్గకపోవడంతో హేజిల్ వుడ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అషిల్లేస్ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదు. దాంతో, స్వదేశానికి తిరిగి వెళ్లనున్నాడు. అతనితో పాటు అష్టన్ అగర్, మ్యాట్ రెన్‌షా కూడా బయలుదేరనున్నారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఇక కెప్టెన్ పాట్ కమిన్స్ కుటుంబంలో ఒకరికి తీవ్రమైన ఆనారోగ్యం కారణంగా అతడు స్వదేశానికి బయల్దేరి వెళ్లనున్నాడు. అతను మూడో టెస్టు ప్రారంభమయ్యే సమయానికి ఇండియాకు తిరిగి వస్తాడని సమాచారం. లేనిపక్షంలో మూడోటెస్ట్‌కు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండో టెస్టులో డేవిడ్ వార్నర్ కంకషన్‌గా పెవిలియన్ చేరాడు. బంతి బలంగా చేతికి తాకడంతో అతను మైదానం వీడాడు. అతని ప్లేస్‌లో ట్రావిస్ హెడ్ ఆడిన సంగతి తెలిసిందే.
- గ్రీన్, స్కార్ట్ ఫిట్..!
గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్కార్ట్ ఇండోర్ టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. టెస్టు జట్టులో మార్పుల గురించి ఆసీస్ మేనేజ్‌మెంట్ బుధవారం అధికారికంగా వెల్లడించనుంది. ఢిల్లీ టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 10 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ 7 వికెట్లు తీయడంతో ఆసీస్ 113కే కుప్పకూలింది.










