May 22,2023 21:56
  • నేడు సూపర్‌కింగ్స్‌, టైటాన్స్‌ ఢీ
  • ఫైనల్లో చోటు కోసం అమీతుమీ
  • చెపాక్‌లో ఫేవరేట్‌గా ధోనీసేన
  • రాత్రి 7.30 నుంచి క్వాలిఫయర్‌ 1 పోరు

గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ క్వాలిఫయర్‌1 పోరుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌16 ఫైనల్లో తొలి అడుగు వేసేందుకు నేడు చెపాక్‌లో స్పిన్‌ సవాల్‌కు సై అంటున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ వరుసగా రెండో ఫైనల్లోకి చేరుకునేందుకు ఎదురుచూస్తుండగా.. నాలుగు సార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ రికార్డు స్థాయిలో మళ్లీ తుది పోరులో తలపడేందుకు ఉవ్విళ్లూరుతోంది. గ్రూప్‌ దశ మ్యాచుల్లో టాప్‌-2 నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ అంతిమ సమరానికి చేరుకునేందుకు రెండు అవకాశాలు దక్కించుకున్నాయి. తొలి చాన్స్‌లోనే ఫైనల్లోకి అడుగుపెట్టే జట్టు ఏదో నేడు చెపాక్‌లో తేలనుంది.
నవతెలంగాణ-చెన్నై : నిలకడ, బాధ్యతల్లో స్పష్టత, నిరూపించుకునే అవకాశం ఇవ్వటం, సహజశైలిలో రాణించేందుకు స్వేచ్ఛ కల్పించటం.. చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ విజయ మంత్ర ఇదే. సూపర్‌కింగ్స్‌, టైటాన్స్‌ మైదానంలో అనుసరించే వ్యూహలు పూర్తి భిన్నం. కానీ జట్టును విజయ పంథాలో నడిపించేందుకు అనుసరించే మార్గాలు మాత్రం ఒకటే కావటం యాదృచ్చికం ఏమీ కాదు. ఎం.ఎస్‌ ధోని నాయకత్వ లక్షణాల నుంచి ప్రేరణ పొందిన హార్దిక్‌ పాండ్య.. మహి తరహాలోనే కూల్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ను నడిపిస్తున్నాడు. అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిచిన టైటాన్స్‌.. రెండో సీజన్లో మళ్లీ టైటిల్‌ నిలుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఐపీఎల్‌ ఆరంభం నుంచీ అత్యంత నిలకడగా సూపర్‌కింగ్స్‌కు సారథ్యం వహిస్తూ ఏకంగా 12వ సారి చెన్నైకి ప్లే ఆఫ్స్‌కు చేర్చిన నాయకుడు ఎం.ఎస్‌ ధోని. ఇప్పుడు క్వాలిఫయర్‌ 1 పోరులో ధోని, హార్దిక్‌ నాయకులుగా మరోమారు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో టైటాన్స్‌, సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లో పాండ్యసేన పైచేయి సాధించగా.. ఇప్పుడు సీజన్‌ 71వ మ్యాచ్‌లో చెన్నై లెక్క సరిచేస్తుందేమో చూడాలి. చెన్నై సూపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ క్వాలిఫయర్‌ 1 పోరు నేడు చెపాక్‌లో రాత్రి 7.30 గంటలకు ఆరంభం. స్టార్‌స్పోర్ట్స్‌, జియో సినిమాలో మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
టాప్‌ ఆర్డరే కీలకం! : చెన్నై సూపర్‌కింగ్స్‌కు టాప్‌ ఆర్డర్‌ అత్యంత కీలకం. ఓపెనర్లు డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌ కెరీర్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే తాజా సీజన్లో ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి వెయ్యికి పైగా పరుగులు జోడించిన కాన్వే, రుతురాజ్‌ క్వాలిఫయర్‌లో ధనాధన్‌ ప్రదర్శన పునరావృతం చేసేందుకు చూస్తున్నారు. కెరీర్‌ ముగిసిందనుకున్న తరుణంలో అనూహ్యంగా సరికొత్త రూపంలో దూసుకొచ్చిన బ్యాటర్‌ అజింక్య రహానె. తొలుత నాలుగు మ్యాచుల్లో దడ పుట్టించిన రహానె.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడే భారత జట్టులో చోటు దక్కించుకున్న అనంతరం కాస్త నెమ్మదించాడు. డ్రెస్సింగ్‌రూమ్‌ నుంచి రహానెపై ఎటువంటి ఒత్తిడి లేదు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు అజింక్య మళ్లీ ధనాధన్‌ విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఉంది. కీలక క్వాలిఫయర్‌లో రహానె దంచికొడితే సూపర్‌కింగ్స్‌ ఫ్యాన్స్‌కు అది పండుగే. ఇక అంబటి రాయుడు, మోయిన్‌ అలీ, రవీంద్ర జడేజాలు ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రభావం చూపించలేదు. టాప్‌ ఆర్డర్‌ ఎక్కువ బాధ్యత తీసుకోవటం సైతం అందుకు ఓ కారణమే. అయితే, కీలక క్వాలిఫయర్‌లో లోయర్‌ ఆర్డర్‌లోనూ ధనాధన్‌ మెరుపులు అవసరమే. చెపాక్‌లో మహీశ్‌ తీక్షణకు తోడు జడేజా, మోయిన్‌ అలీ 12 ఓవర్లు కీలకం కానున్నాయి. పవర్‌ప్లేలో దీపక్‌ చాహర్‌, డెత్‌ ఓవర్లలో మతీశ పతిరణలు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా నిలువనున్నారు. ఇక ఎం.ఎస్‌ ధోని నాయకత్వం అంతిమంగా సూపర్‌కింగ్స్‌కు అతిపెద్ద బలం.
టైటాన్స్‌కు ఎదురేది : గుజరాత్‌ టైటాన్స్‌ వరుస రెండు సీజన్లుగా అదరగొడుతుంది. ఆ జట్టుకు ఎదురు నిలిచే సత్తా ఎవరికుందనే తరహాలో హార్దిక్‌ సేన రాణిస్తుంది. గ్రూప్‌ దశలో 10 మ్యాచుల్లో గెలుపొందిన టైటాన్స్‌.. కేవలం నాలుగింటిలోనే ఓటమి చవిచూసింది. పది జట్లతో కూడిన లీగ్‌లో ఇది సాధారణ విషయం కాదు. టైటాన్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అపూర్వ ఫామ్‌లో ఉన్నాడు. వరుస శతకాలు సాధించిన గిల్‌.. చెపాక్‌లో మరో మూడెంకల స్కోరుపై కన్నేశాడు. వృద్దిమాన్‌ సాహా కీలక మ్యాచుల్లో అనూహ్య ప్రదర్శన చేసే అలవాటు కొనసాగిస్తే టైటాన్స్‌కు తిరుగులేదు. టైటాన్స్‌ను వేధిస్తున్న ఒకే సమస్య నం.3 బ్యాటింగ్‌ పొజిషన్‌. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, విజరు శంకర్‌లు ఆ స్థానంలో ఆడుతున్నారు. డెవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియ, రషీద్‌ ఖాన్‌లు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రత్యేకించి ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ను అడ్డుకోవటం ప్రత్యర్థి బౌలర్లకు సాధ్యపడటం లేదు. ఇక టైటాన్స్‌కు అదనపు బౌలర్‌ సమస్య సైతం ఉంది. చెపాక్‌ పిచ్‌పై రాహుల్‌ తెవాటియ, శనక సేవలను పాండ్య వినియోగించుకునే అవకాశం లేకపోలేదు. మహ్మద్‌ షమి, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మలతో కూడిన పేస్‌ త్రయం బాగుంది. స్పిన్‌ మాస్టర్‌ రషీద్‌ ఖాన్‌ చెపాక్‌లో మాయ చేయగల సమర్థుడు.
పిచ్‌, పరిస్థితులు : చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చెపాక్‌ పిచ్‌ సహజసిద్ధంగా స్పిన్‌ స్వర్గధామం. ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసే జట్టు మంచు ప్రభావం నుంచి తప్పించుకునే మార్గాలు అన్వేషించాల్సిందే. ఈ సీజన్లో చెపాక్‌లో జరిగిన ఏడు మ్యాచుల్లో నాలుగింట రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టు విజయం సాధించింది. మంచు ప్రభావం సైతం అందుకు ఓ కారణం కావచ్చు!. టాస్‌ నెగ్గిన జట్టు ఎటువంటి ఆలోచన లేకుండా తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది.
తుది జట్లు అంచనా
గుజరాత్‌ టైటాన్స్‌ :
శుభ్‌మన్‌ గిల్‌, వృద్దిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), విజరు శంకర్‌, డెవిడ్‌ మిల్లర్‌, దసున్‌ శనక, రాహుల్‌ తెవాటియ, రషీద్‌ ఖాన్‌, యశ్‌ ధయాల్‌, మహ్మద్‌ షమి, నూర్‌ అహ్మద్‌, మోహిత్‌ శర్మ.
చెన్నై సూపర్‌కింగ్స్‌ : డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌, అజింక్య రహానె, శివం దూబె, మోయిన్‌ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), దీపక్‌ చాహర్‌, మహీశ్‌ తీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, మతీశ పతిరణ.