- 5,338 మంది నైట్‌వాచ్‌మెన్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
- ఎపి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత బిల్లు-2023కు ఆమోదం
- రిజిస్ట్రేషన్ సేవలకు ఇ-స్టాంపింగ్ విధానం
- మంత్రివర్గ నిర్ణయాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పాఠశాలలకు కాపలాదారులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,338 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి నైట్ వాచ్‌మెన్‌ల పోస్టులను పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యాన భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ మంత్రి మండలి తీర్మానించింది. రూ.6 వేల గౌరవ వేతనం అమ్మఒడి ద్వారా జమ చేసుకుంటున్న టాయిలెట్ మెయిన్‌టెన్స్ ఫండ్ (టిఎంఎఫ్) నుంచి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 45 అంశాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఎపి మహిళా కమిషన్ పదవీకాలానికి సంబంధించి ఉమెన్ కమిషన్ యాక్ట్-1998 సవరణలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మహిళా కమిషన్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీర్మానానికి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ యాక్ట్-1998 సవరణ బిల్లుకు ఆమోదంతోపాటు కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదముద్ర వేసింది. స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ యాక్ట్-2019 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఛైర్మన్ సభ్యుల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎపి షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్‌ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్‌ప్లాన్ (ఆర్థిక వనరుల ప్రణాళిక, కేటాయింపు, వినియోగానికి సంబంధించి) యాక్ట్-2013 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లులకు ఆమోదం లభించింది.
ఎపి కార్గ్-పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. దమిల్క్ ప్రొక్యూర్‌మెంట్ (ప్రొటక్షన్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ ఆప్ మిల్క్ స్టాండర్స్) బిల్లు-2023కు ఆమోదం లభించింది. ఈ బిల్లు ద్వారా పాలసేకరణకు సంబంధించి పాడి రైతుల ప్రయోజనాలతోపాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం. ఎపి మీడియా అక్రిడిటేషన్ రూల్ -2019కు మార్పులు చేస్తూ, సమగ్ర నూతన విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఎయిడెడ్, ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఎపి ఎడ్యుకేషన్ యాక్ట్-1982ను రీప్టేస్ చేస్తూ ఆంద్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్-2022 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన ఇండిస్టియల్ డెవలప్‌మెంట్ పాలసీ 2023-27కు కేబినెట్ ఆమోదం, ఆంద్రప్రదేశ్ ఇన్‌లాండ్‌వాటర్ వేస్ అభివృద్ధి, కోసం ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఉద్ధేశించిన ఆంధ్రప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ బిల్లు-2023 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. మున్సిపల్ యాక్ట్ సవరణలకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సవరణలను కేబినెట్ ఆమోదించింది. అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రెండు పట్టణ స్థానిక సంస్థలు, 120 రెవెన్యూ గ్రామాలతో 11 మండలాలను కలుపుకుని మొత్తం 896.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం లభించింది. కొత్తగా ఏర్పాటుచేసిన 6 మండలాలు (అనపర్తి, పిడుగురాళ్ళ, మైదుకూరు, మైలవరం, ఉదయగిరి, నిడదవోలు)లో అవుట్‌సోర్సింగ్ విధానంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. 18 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగల్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ సేవలకు ఇ-స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తప్పుడు రిజిస్ట్రేషన్లను నివారించడానికి అవసరమైన ప్రతిపాదనలతో రిజిస్ట్రేషన్ యాక్ట్ -1908కు సవరణకు కేబినెట్ ఆమోదం లభించింది. ఎక్త్సెజ్ చట్టం సవరణకు కేబినెట్ గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రీలిజియస్ ఇనిస్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ -1987 ప్రకారం అన్ని దేవస్థానాల బోర్డుల్లో ఒక నాయిబ్రాహ్మణుడిని సభ్యునిగా నియమించాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. పట్టాదారు పాస్‌బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణ, ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ ఆర్డినెన్స్-2022 చట్ట సవరణను కేబినెట్ ఆమోదించింది. మచిలీపట్నంలో 220 గజాల స్థలం మదరసాకు కేటాయింపును ఆమోదించింది.
ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌కు అభినందనలు
నాటు నాటు పాటకు ఆస్కార్ సాధించిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు కేబినెట్ అభినందనలు తెలిపింది. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్పు ఘన విజయం వెనుక ముఖ్యమంత్రి కృషిని మంత్రులు కొనియాడుతూ.. ప్రశంసిస్తూ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు తీర్మాణం ప్రవేశపెట్టగా, మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.










