నాగ్‌పూర్ : యాషెస్ సిరీస్ గెలుపుకంటే.. భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలుపే పెద్ద విజయంగా భావిస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పేర్కొన్నాడు. హెడ్‌కోచ్ మెక్ డోనాల్డ్‌తో కలిసి సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆసీస్ కెప్టెన్ పైవిధంగా స్పందించాడు. ఇదే అభిప్రాయాన్ని సీనియర్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ కూడా అంగీకరించారు. భారత్‌లో టెస్ట్ సిరీస్ సవాలుతో కూడుకున్నదని స్టీవ్ స్మిత్ పేర్కొనగా.. భారత పిచ్‌లపై స్పిన్నర్లను ఎదుర్కొవడం కత్తిమీద సామువంటిదని వార్నర్ తెలిపాడు. తమజట్టులో హేజిల్‌వుడ్, మిఛెల్ స్టార్క్‌వంటి నాణ్యమైన పేసర్లున్నారనే విషయాన్ని భారత బ్యాటర్స్ గుర్తుంచుకోవాలన్నాడు. ఇక నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు మిఛెల్ స్టార్క్ దూరమయ్యాడు. నెట్‌ప్రాక్టీస్‌లో స్టార్క్ వేలికి తీవ్ర గాయం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక చారిత్రాత్మక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కు అత్యంత ప్రజాదరణ ఉన్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగనున్నండగా.. తొలిటెస్ట్ గురువారం(9నుంచి) ప్రారంభం కానుంది. ఇరుజట్ల మధ్య గత ఏడాది జనవరిలో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరగ్గా ఇందులో భారత్ 2-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది.
- రోహిత్‌ను ఊరిస్తోన్న ఓ రికార్డు..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ రికార్డు ఊరిస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ ఓ సెంచరీ చేస్తే, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా, ఓవరాల్‌గా నాలుగో కెప్టెన్‌గా రికార్డు పుటల్లోకెక్కనున్నాడు. రోహిత్ కెరీర్‌లో ఇప్పటివరకు కెప్టెన్‌గా వన్డే, టీ20ల్లో మాత్రమే సెంచరీలు చేశాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గా ఒక్క సెంచరీ కూడా లేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భాగంగా జరిగే 4 టెస్టుల్లో హిట్‌మ్యాన్ ఒక్క సెంచరీ చేసినా, దిగ్గజ కెప్టెన్లు గంగూలీ, ధోనీ, కోహ్లీలకు సాధ్యంకాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు. టెస్టుల్లో రోహిత్ 8 సెంచరీలు చేసినప్పటికీ, అవన్నీ ఆటగాడిగా సాధించినవే. కాగా, కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన రికార్డు ముగ్గురి పేరిట ఉంది. తొలుత శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ సారథి డుప్లెసిస్, ఇటీవలే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కెప్టెన్లుగా ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్-ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్టు మ్యాచ్‌ల్లో పోటీపడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.










