Jul 16,2022 07:23
  • వణుకుతున్న పరివాహక ప్రాంతం
  • భద్రాచలం నుండి లంకల వరకు భయంభయం
  • సిఎం ఏరియల్‌ సర్వే
  • రంగంలోకి సైన్యం

గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ప్రళయాన్ని తలపిస్తూ విరుచుకుపడుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వరద గోదావరి ధాటికి జనం బెంబెలెత్తుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం నుండి ధవళేశ్వరం వద్ద ఉన్న లంకల వరకు పరివాహక ప్రాంతం గోదావరి ప్రవాహ జోరుకు వణికిపోతోంది. ధవళేశ్వరం బ్యారేజి నుండి శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 21.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైన్య సహాయం కోరాయి. తెలంగాణలోని భద్రాచలం వద్ద పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో శుక్రవారం సాయంత్రం సైన్యం రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ప్రజాశక్తి- యంత్రాంగం : ధవళేశ్వరం వద్ద మరింత ప్రమాదకరంగా పరిస్థితి మారే అవకాశం ఉందన్న అంచనాల నేపధ్యంలో సైన్యం సేవలు శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 71 అడుగులకు చేరింది. అంతకుముందు ఉదయం నుండి భద్రాచలంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకదాని తరువాత గోదావరి ప్రవాహధాటికి ఒకదాని తరువాత ఒకటిగా అక్కడికి వెళ్లే రోడ్డు మార్గాలు నీట మునిగాయి. సహాయ కార్యక్రమాల కోసం రోడ్డు మార్గాన తోలు బయలు దేరిన సైన్యం ఆ తరువాత హెలికాప్టర్లలో అక్కడకు చేరాల్సివచ్చింది.
 

                                                         ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం వద్ద అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ 175 గేట్లను పూర్తి స్థాయిలో పైకిఎత్తి 21.52 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వరద ధాటికి తూర్పుగోదావరి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌, పశ్చిమగోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలన్నీ నీటమునిగాయి. పోలవరం అప్పర్‌ స్పిల్‌వే వద్ద 36.15 మీటర్లు, డౌన్‌ స్పిల్‌వే వద్ద 28 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. ఇక్కడి నుంచి దాదాపుగా 25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులున్నారు. 1986ని మించి గోదావరి పోటెత్తడంతో గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. గోదావరి వరదలకు రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో 42 మండలాల పరిధిలోని 279 గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. మరో 177 గ్రామాల్లో వరద ప్రవాహం ఉంది.
 

                                                                 25 లక్షల క్యూసెక్కులు...?

ధవళేశ్వరం బ్యారేజి వద్ద శనివారం నాటికి 25 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని అంచనా. అదే జరిగితే ఆరు జిల్లాల్లోని 44 మండలాల్లోని 628 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 21, తూర్పుగోదావరిలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో5, పశ్చిమగోదావరి జిల్లాలో4, ఏలూరులో 3, కాకినాడలో 2 మండలాలపై ప్రభావం ఉంటుందని అంచనా . సహాయక చర్యలో 10 ఎన్‌డిఆర్‌ఎఫ్‌, 10 ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు పాలపంచుకుంటున్నాయి.

                                                  పర్యవేక్షణకు సీనియర్‌ అధికారులు : సమీక్షలో సిఎం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వరద పీడిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకోసం జిల్లాకు ఒక సీనియర్‌ అధికారిని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయమిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్‌, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు మురళీధర్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రవీణ్‌కుమార్‌, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌ను నియమించినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంత జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికన వారికి అందేలా చూడాలని సిఎస్‌ సహా అన్ని విభాగాల కార్యదర్శులకు సిఎం ఆదేశించారు. సిఎంఓ కార్యదర్శులు కూడా అందుబాటులో ఉంటారన్నారు. గోదావరిలో నీటి మట్టం శనివారం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వరద బాధితులకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని , బియ్యం ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలని సిఎం అధికారులను ఆదేశించారు. అత్యవసర సర్వీసుల కోసం, పరిస్థితిని సమీక్షించేందుకు రాజమండ్రిలో రెండు హెలికాప్టర్లు సిద్దంగా ఉంచినట్లు తెలిపారు.