- సజ్జలకు అమరావతి జెఎసి వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగులకు సంబంధించి 45 రోజుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంటు ఇప్పించాలని ఎపి జెఎసి అమరావతి కోరింది. అమరావతి జెఎసి మహిళా విభాగ కమిటీ ఎన్నికైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళవారం రాష్ట్ర మహిళా కమిటీ ఛైర్మన్ పొన్నూరు విజయలక్ష్మితో కలిసి అమరావతి జెఎసి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు కలిశారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వ పద్ధతిలో చైల్డ్‌కేర్ సెలవులు ఇవ్వాలన్నారు. ప్రతి కార్యాలయంలో మహిళా ఉద్యోగులు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు ఇంటర్నల్ కంప్లైంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్‌టిసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎపిఎస్ ఆర్‌టిసిలో ఎంప్లాయీస్ యూనియన్‌కు గుర్తింపు సంఘం హోదా ఇవ్వడం పట్ల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సజ్జలను కలిసిన వారిలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జివి నర్సయ్య, నాయకులు పి సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.










