Oct 03,2023 21:30

వెనుకబడిన ప్రాంతాలను ప్రత్యేక నిధులిచ్చి అభివృద్ధి చేయాలి
పాదయాత్రలో సిపిఎం నాయకులు వి శ్రీనివాసరావు, ఎంఎ గఫూర్‌ డిమాండ్‌
ప్రజాశక్తి- సీతారాపురం (నెల్లూరు జిల్లా), తాడేపల్లి (గుంటూరు జిల్లా):సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. వెనుకబడిన ప్రాంతాలను ప్రత్యేక నిధులిచ్చి అభివృద్ధి చేయాలని కోరారు. గత ఎన్నికల ముందు మోడీ, జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలను, ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన జిల్లా సమగ్రాభివృద్ధి యాత్రలు జరుగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు బృందాలు పాదయాత్రలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా రెండో బృందం పాదయాత్రను సీతారామపురం మండలం బసినేనిపల్లి వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం శిలాఫలకాలకే పరిమితమైందని, ఎంతో వెనుకబడి ఉందని, ఈ ప్రాంతం నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో సీతారామసాగర్‌ ప్రాజెక్ట్‌ కోసం సిపిఎం పలు పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి ఒక కాలువ ద్వారా వెలుగొండ ప్రాజెక్టుకు, సీతారామ సాగర్‌ను నిర్మించి మరో కాలువ ద్వారా నీరు అందిస్తే ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలతోపాటు కడప, ప్రకాశం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలం అవుతాయన్నారు. వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాస కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రధాని మోడీ చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. అత్యధిక ఎంపి స్థానాల్లో వైసిపిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి... అధికారంలోకి వచ్చాక మోడీకి భయపడి ప్రత్యేక హోదా పోరాటాన్ని పక్కనపెట్టారని, అదానీ, అంబానీ లాంటి కార్పొరేటర్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారమూ ఇప్పటికీ అందలేదని పలువురు గ్రామస్తులు శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కటారి అజరుకుమార్‌, మూళి వెంగయ్య పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా మంగళవారం నియోజకవర్గ ప్రజా చైతన్యయాత్రను ఉండవల్లి సెంటర్‌లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసినా బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఎందుకు సాగిలపడుతున్నాయని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని వచ్చిన పవన్‌ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రెండు పార్టీల తగాదాల్లో ప్రజలు నలిగిపోతున్నారన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరామతిని భ్రమరావతిగా మిగిల్చిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి అంగీకరించిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు మూడు రాజధానులని అంటున్నారని దుయ్యబట్టారు. దీనిపై ప్రధాని మోడీ నోరు ఎందుకు మెదపడంలేదని ప్రశ్నించారు. మూడు రాజధానులు కాదు... 30 రాజధానులు పెట్టుకోమని బిజెపి నాయకులు జివిఎల్‌ నరసింహారావు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలనేది సిపిఎం విధానమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని సిపిఎం కోరుకుంటోందని తెలిపారు. సిపిఎం తాడేపల్లి పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి, ఎస్‌ఎస్‌ చెంగయ్య, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

nellur