హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరోసారి ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఆర్‌సిబి బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్‌కు ఫోన్‌చేసి జట్టులోని అంతర్గత విషయాలు చెబితే భారీ మొత్తంలో డబ్బులిస్తామంటూ ఎర చూపాడు. దీంతోపాటు వాట్సప్‌కు మెస్సెజ్‌లు కూడా చేశాడు. అయితే ఈ విషయాన్ని సిరాజ్ బీసీసీఐ, అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) తెలియజేశాడు. దీంతో బిసిసిఐ వేగంగా చర్యలు చేపట్టింది. సిరాజ్‌ను సంప్రదించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. దీనిపై బిసిసిఐ అధికారి మాట్లాడుతూ.. ''సిరాజ్‌ను సంప్రదించింది బుకీ కాదు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ హైదరాబాద్ డ్రైవర్. బెట్టింగ్‌లో అతడు చాలా మేర డబ్బు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో అతడు సిరాజ్‌ను సంప్రదించి ఆర్సీబీ అంతర్గత విషయాలు అడిగాడు. ఈ విషయాన్ని సిరాజ్ వెంటనే తెలియజేశాడు. అని పేర్కొన్నారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో తక్షణమే చర్యలు తీసుకున్నామని.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వ్యక్తిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారని తెలిపారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. కాగా గతంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీమాల్ ఫిక్సింగ్ ఉచ్చులో పడి కెరీర్‌ను నాశనం చేసుకున్న విషయం తెలిసిందే.










