Apr 24,2023 10:09

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారుకు చెందిన సూరపు వెంకటరావుకు మూడు ఎకరాల పొలం ఉంది. వర్షాధారంగా వరి సాగు చేస్తున్నారు. 2020 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం 'వైఎస్‌ఆర్‌ జలకళ పథకం' ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో ఆయన పొలంలో అధికారులు బోరు వేశారు. ఆ తర్వాత విద్యుత్‌శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తే రెండో పంట కూడా వేసుకుందామని అనుకుంటున్న తరుణంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్‌శాఖ అధికారులు వెనక్కి తీసుకెళ్లిపోయారు.
ఇదే మండలం చీపుర్లుపాడు పంచాయతీ ఊడికలపాడుకు చెందిన నేతింటి వెంకటరావు పొలంలో ఏడాది కిందట అధికారులు బోరు వేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినా నేటికీ కనెక్షన్‌ ఇవ్వలేదు. ఈ సమస్య వీరిద్దరికే పరిమితం కాదు.. సాగు నీటి సౌకర్యం లేక బోర్లు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది.
           నవరత్నాల్లో భాగంగా భూగర్భ జలాలను వినియోగించుకుని రైతుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం సెప్టెంబర్‌ 28, 2020లో వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం అక్టోబర్‌ తొమ్మిదిన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై జిఒ నంబరు 676 వెలువరించింది. 2.5 ఎకరాల నుంచి ఐదెకరాల వరకు ఉన్న రైతులను అర్హులుగా పేర్కొంది. పథకం కింద బోర్లతో పాటు విద్యుత్‌ కనెక్షన్లను పూర్తి ఉచితంగా అందిస్తామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా 2,28,421 మంది దరఖాస్తు చేసుకున్నారు. బోర్ల తవ్వకాలు, మోటార్ల పంపిణీ, విద్యుత్‌ కనెక్షన్లకు భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబరులో పథకంలో స్వల్ప మార్పులు చేసింది. ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రూ.రెండు లక్షల వరకు విద్యుత్‌ కనెక్షన్‌ ఖర్చును భరిస్తామని పేర్కొంది. రైతులు అందుకు సిద్ధపడినా ఆ డబ్బులనూ విడుదల చేయలేదు. జలకళ కింద ఇవ్వనున్న ఉచిత బోర్లలో ప్రభుత్వం రకరకాల పిల్లిమొగ్గలు వేయడంతో పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
 

                                                       లక్షల్లో దరఖాస్తులు... వందల్లో విద్యుత్‌ కనెక్షన్లు

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 2,28,421 దరఖాస్తుల్లో 1,88,571 దరఖాస్తులకు విఆర్‌ఒలు అప్రూవల్‌ ఇచ్చారు. అర్హత సాధించిన వాటిలో 66,190 దరఖాస్తులకు భూగర్భ జలశాఖ అధికారులు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. వాటిలో 42,388 చోట్ల బోర్ల తవ్వకాలకు కలెక్టర్లు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఇప్పటివరకు 19,908 చోట్ల బోర్లను వేశారు. వాటిలో కేవలం 1721 మంది రైతులకే విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. ప్రభుత్వం తొలుత వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం వాటిలో కేవలం 1721 మంది రైతుల పొలాలకే విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.రెండు లక్షల వరకు విద్యుత్‌ కనెక్షన్‌ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా ఆ తర్వాత ఒక్క కనెక్షనూ మంజూరు చేయలేదు. కొన్నిచోట్ల విద్యుత్‌శాఖ కనెక్షన్లు ఇచ్చినా వాటికైన ఖర్చునూ ప్రభుత్వం చెల్లించలేదని తెలుస్తోంది.