-మౌళిక సదుపాయాలపై దృష్టి
- పరిశ్రమలశాఖ సమీక్షలో సిఎం
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఇలకు ప్రోత్సాహమిచ్చి, అండగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమలశాఖపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎంఎస్‌ఎంఇలకు అందేలా చూడాలన్నారు. క్లస్టర్ పద్దతిలో వీటిని పోత్సాహించాలని, ఒకే తరహా ఉత్పత్తులను అందిస్తున్న గ్రామాలనూ ఈ కోవలోనే చూడాలని చెప్పారు. పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నివారణపై చర్యలు తీసుకోవాలని, కాలుష్య జలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రత్యేక నిధి ద్వారా కాలుష్య నివారణ వ్యవస్థలను పారిశ్రామికవాడల్లో బలోపేతం చేయాలన్నారు. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మౌలికసదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వే లైన్లకు సంబంధించిన సదుపాయాలు కల్పించాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల పెద్దఎత్తున ఉపాధి దొరుకుతుందని తెలిపారు. వీటికోసం 66 వేల ఎకరాలు అవసరం ఉందని చెప్పారు. అర హెక్టార్‌కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా, ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉన్నవారు 75 శాతం ఉన్నారని ఎలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల బీడు భూములున్నవారికి మంచి ఆదాయం వస్తుందని, ఎకరాకు రూ.30 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. పంప్డ్ స్టోరేజీ పవర్‌కి వ్యాల్యూ అడిషన్ చేస్తున్నామని, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా తయారీపై దృష్టి పెట్టామని చెప్పారు. దీనివల్ల గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందడుగు వేస్తామని చెప్పారు. రాష్ట్రంలో విస్తృతంగా ధాన్యం పండిస్తున్నరని, బియ్యాన్ని వాడుకుని ఇథనాల్ తయారీపై దృష్టి సారించాలని అన్నారు. అయిల్‌పాం ప్రాసెసింగ్‌కు మంచి విధానాలు తీసుకురావాలని అన్నారు. త్వరలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మూడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను అధికారులు సిఎంకు వివరించారు. 96 భారీ, అతిభారీ యూనిట్లు, 28,343 ఎంఎస్‌ఎంఇలు ఉత్పత్తి ప్రారంభించాయని వివరించారు. వీటి ద్వారా రూ.47,490 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 2,48,122 మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. రూ.1,51,372 భారీ, అతిభారీ కంపెనీలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వీటిల్లోనూ 1.77 లక్షలమందికి ఉపాధి వస్తుందని తెలిపారు. 92 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, మొత్తంగా రూ.2,19,766 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, 3.19 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య సదుపాయాల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గుడివాడ అమర్‌నాథ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, డైరెక్టర్ సృజన, ఎపిఐఐసి విసి జె.సుబ్రహ్మణ్యం, మారిటైంబోర్డు ఛైర్మన్ వెంకటరెడ్డి, ఎపిటిపిసి ఛైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










