Oct 14,2023 21:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌:రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై టిడిపి నాయకులు, ఆయన కుటుంబ సభ్యులు డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా ఆరోగ్యం బాగోలేకపోతే కోర్టులో ఎందుకు పిటిషన్‌ వేయలేదని ప్రశ్నించారు. విజయనగరంలోని ఎమ్మెల్యే అప్పలనర్సయ్య నివాసంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబుకు సరైన వైద్యం అందడం లేదని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని మూడు రోజులుగా టిడిపి నాయకులు కొత్త డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తే మెరుగైన వైద్యం కోసం అనుమతి ఇవ్వాల్సింది ప్రభుత్వమా? కోర్టా? అని ప్రశ్నించారు. కోర్టులో పిటిషన్‌ వేయకుండా డ్రామాలు ఎందుకని నిలదీశారు. శుక్రవారం రాత్రి ఒక సామాన్య వ్యక్తితో నాకు ఫోన్‌ చేయించి 'చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు కదా? ఆయనను జైలు నుంచి విడిచి పెట్టండయ్యా' అంటూ ఏడుస్తూ మాట్లాడించారని తెలిపారు. ఆయన తప్పు చేశాడా? లేదో కోర్టులో తెలుస్తుందని తాను బదులిచ్చానని చెప్పారు. ఉదయం లేచేసరికి ఆ వ్యక్తి నాతో మాట్లాడింది పేపర్లలో, టివి ఛానల్‌ల్లో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇటువంటి డ్రామాలు ఆడించిన ఛానల్‌ యాజమాన్యంపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. నూటికి రెండు వందల శాతం చంద్రబాబు స్కిల్‌ డెవల్‌మెంట్‌ పేరుతో అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. చంద్రబాబుకు కనీసం నీళ్లు కూడా ఇవ్వరా? అని అశోక్‌ గజపతిరాజు నీతి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టిడిపి నాయకులు బెయిల్‌ కోసం కృషి చేయడం లేదని, చంద్రబాబును జైల్లోనే ఉంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరిపాలన విశాఖ నుంచి వేగంగా జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.