- అధికారులతో సమీక్ష
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాల కేటాయింపుల అంశంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయంపై ఆయన సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని ఈ సమావేశంలో ఆయన అన్నారు. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని చెప్పారు. అంతకుముందు అధికారులు మాట్లాడుతూ కృష్ణా ట్రిబ్యునల్ 2తో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, నష్టంపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్రం చేసిన ఈ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని, రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని, ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా గెజిట్ విడుదలచేశారని అధికారులు తెలిపారు. పోలవరం ద్వారా కృష్ణాబేసిన్‌కు మళ్లించేనీటిని పరిగణలోకి తీసుకొని ఆమేరకు తెలంగాణాకు కేటాయింపులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. 2002కు ముందు చేసిన ట్రిబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పున్ణపరిశీలించరాదని చట్టం చెప్తున్నా అందుకు విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు చేసిందని అధికారులు వివరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇఎన్‌సి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










