ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర ఖజానాకు సంబంధించిన నెలవారీ లెక్కలపై కాగ్ మళ్లీ వివరాలు కోరినట్లు తెలిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదో నెల గడుస్తున్నా, ఇంకా తొలి నెల లెక్కలు కూడా ఖరారు కాలేదు. ఒకవైపు పక్క రాష్ట్రమైన తెలంగాణలో జూన్ వరకు మూడు నెలల గణాంకాలు కూడా సిద్ధం చేయగా, ఆంధ్రా నుంచి ఒక్క నెలది కూడా ఖరారు కాకపోవడం గమనార్హం. ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తుది లెక్కలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. లెక్కలకు సంబంధించిన వివరాల పెండింగ్‌పై పదేపదే కాగ్, ఎజి కార్యాలయాల నుంచి రాష్ట్ర ఆర్థికశాఖకు లేఖలు వచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు ఆర్థికశాఖ అధికారులు మాత్రం వివరాలు సిద్ధం చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఎజి కార్యాలయం అధికారులు ఆర్థికశాఖతో లెక్కలపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా రుణాలు, గ్యారెంటీల వివరాలు సిద్ధం చేయడంలో నెలకొంటున్న సందిగ్ధమే ఈ జాప్యానికి కారణంగా ఆర్థికశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.










