Sep 17,2023 21:59

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో రూ.371 కోట్ల నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని సిఐడి పునరుద్ఘాటించింది. సిఐడి చీఫ్‌ ఎన్‌ సంజరు, అడిషనల్‌ ఎజిపి పి సుధాకర్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నాటి ప్రభుత్వం షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. నాటి ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ పేర్కొందని, పక్కా ప్లానింగ్‌తోనే నిధులు మళ్లించారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సూత్రధారి చంద్రబాబేనని, ఆయన కనుసన్నల్లోనే స్కామ్‌ జరిగిందన్నారు. సెప్టెంబరు 5న చంద్రబాబు పిఎ పెండ్యాల శ్రీనివాస్‌కి నోటీసు ఇచ్చామని, అయితే 24 గంటల్లో ఆయన విదేశాలకు పారిపోయాడన్నారు. సీమెన్స్‌ ద్వారా మాత్రమే 2.13 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారనడం సరికాదని, నాలుగైదు సంవత్సరాల నైపుణ్యాభివృద్ధి కృషి ఫలితమని చెప్పారు.