Apr 29,2023 09:24
  • ఆన్‌లైన్లో కనిపించని పేర్లు
  • ఆఫ్‌లైన్లో సేకరించిన ధాన్యానికి చెల్లింపులపై స్పష్టత కరువు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానంతో ధాన్యం అమ్మకాలకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. లక్ష్యం పూర్తయిందనే కారణంతో మిల్లర్లతో ఆఫ్‌లైన్లో కొనుగోలు చేయించిన ధాన్యానికి నగదు చెల్లింపులపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ తర్వాత ఆన్‌లైన్లో కనిపించడం లేదు. దీంతో, తమ వద్ద మిగిలిన ధాన్యాన్ని ఎలా విక్రయించుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వంలో స్పందన కానరావడం లేదు. ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందనే కారణంతో ఫిబ్రవరి మూడో తేదీ నుంచి మార్చి మూడో తేదీ వరకు నెల రోజులపాటు జిల్లాలో ధాన్యం సేకరణను నిలిపివేసింది. ఆర్‌బికెల్లో ధాన్యం సేకరణ వివరాల నమోదును నిలిపివేసి రైతులు ఆఫ్‌లైన్లో మిల్లులకు తోలుకోవాలని సూచించారు. 15 వేల టన్నుల ధాన్యం ఆఫ్‌లైన్లో మిల్లులకు చేరింది. ఆఫ్‌లైన్‌ ధాన్యానికి మిల్లర్లే రైతులకు నగదు చెల్లింపులు చేయాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో బియ్యానికి ధర లేదనే కారణాన్ని చూపుతూ మిల్లర్లు మద్దతు ధరలో కోత పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
         కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మద్దూరులో 118 మంది రైతులు 850 టన్నులను ధాన్యాన్ని ఆఫ్‌లైన్లో మిల్లులకు తోలారు. 75 కిలోల బస్తాకు రూ.1,530 మద్దతు ధర ఉండగా మిల్లర్లు రైతుకు రూ.1400 మాత్రమే చెల్లించగలమని తహశీల్దార్‌ సమక్షంలోనే తేల్చి చెప్పారు. బస్తాకు రూ.130 వరకు నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరికొన్ని గ్రామాల్లో బస్తాకు రూ.200 కోత పెడుతున్నా గత్యంతరంలేని పరిస్థితుల్లో మిల్లర్లు ఇచ్చిన సొమ్మునే రైతులు తీసుకుంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని ఇటీవల మద్దూరుతోపాటు బాపులపాడు మండలం కానుమోలు రైతులు ఆర్‌బికెలకు తాళాలువేసి నిరసన తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి వచ్చామనే కారణంతో ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 21వ తేదీ వరకు ధాన్యం సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత లేట్‌ ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాకు లక్ష్యాన్ని మరో 20 వేల టన్నుల వరకు అదనంగా పెంచింది. ఈ క్రమంలోనే గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్లో ధాన్యం విక్రయించిన రైతుల పేర్లు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ధాన్యం సేకరణ సైట్లో కనిపించడం లేదు. దీంతో, మిగిలిన ధాన్యం ఎలా అమ్మాలో తెలియక ఆర్‌బికెల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
 

                                                          రబీ ధాన్యం సేకరణపై స్పష్టత కరువు

కాల్వలు, డ్రెయిన్ల మరమ్మతులు చేయాలనే కారణాన్ని చూపి రబీలో దాళ్వా వరి సాగుకు ప్రభుత్వం నీటి విడుదలను నిలిపివేసింది. వ్యవసాయ బోర్లు, విద్యుత్‌ మోటర్ల కింద 28 వేల ఎకరాల్లో రైతులు దాళ్వా వరి సాగు చేశారు. రబీ వరి నూర్పిళ్లు మొదలైనా ఈ ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి మిగతా 7లో స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి 48 వేల టన్నుల వరకు సేకరించాల్సి ఉంది. ధాన్యం సేకరణ లక్ష్యం, ప్రభుత్వ మార్గదర్శకాల కోసం రైతులు, జిల్లా అధికారులు ఎదురు చూస్తున్నారు.
 

                                                         ఆన్‌లైన్లో పేరు కనపడటం లేదంటున్నారు

మొత్తం 4.25 ఎకరాల్లో వరి సాగు చేసి ఇ-క్రాప్‌ చేయించాను. ఫిబ్రవరిలో 77 సెంట్ల భూమిలో పంట నూర్చి ఆర్‌బికె ద్వారా విక్రయించాను. ఇప్పుడు మిగిలిన 3.48 ఎకరాల్లో వరి నూర్చి అమ్మడానికి ఆర్‌బికె వద్దకు వెళితే ఆన్‌లైన్లో పేరు కనిపించడం లేదంటున్నారు.
                                                                        -యలమర్తి చౌదరి, ధాన్యం రైతు, చిట్టూర్పు, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా