Sep 17,2023 06:47
  • టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశ నిర్ణయం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై పార్లమెంటులో చర్చించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. శనివారం దేశరాజధాని ఢిల్లీలో టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం ఎంపిలు గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ అనుసరిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్లమెంటు సమావేశాల్లో చర్చకు పట్టుపడుతామన్నారు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని తెలిపారు. తక్షణమే కేంద్రప్రభుత్వం ఈ ఘటనపై జోక్యం చేసుకుని రాజకీయ కక్షసాధింపులను, అరెస్టులను అడ్డుకోవాలని కోరారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే రాష్ట్రంలోని ప్రజలకు భద్రత ప్రశ్నార్ధకమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కక్షలను నమ్ముకున్నారని, కేంద్రం జోక్యం చేసుకుని ఈ ప్రభుత్వ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఇదే సమయంలో పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులపై అధ్యయనం చేసి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్లమెంటరీ సమావేశం అనంతరం సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ద్‌ లూథ్రాతో పాటు తదితరులను కలిశారు.

జగన్‌ది గజ దొంగ తీరు: లోకేష్‌

సిఎం జగన్‌ది గజదొంగ తీరులా ఉందని లోకేష్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. మహాముదురైన దొంగ మంచోడైన పోలీసును తరిమినట్టుందని పేర్కొన్నారు. 42వేల కోట్ల ప్రజాధనం దోచేసి 38 కేసుల్లో ఏ1గా ఉండి చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి కక్షతో అరెస్ట్‌ చేయించారని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానమే అయితే తను చేసిన దొంగతనాలు, దోపిడీలపై కోర్టుల విచారణకు పదేళ్లుగా ఎందుకు హాజరుకావడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.