Apr 29,2023 10:22
  • కేంద్ర సమాచార శాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయం
  • పోస్టల్‌ సంఘాల రద్దును ఖండించిన సిఐటియు
  • ప్రైవేటీకరణను వ్యతిరేకించినందుకే : యూనియన్‌ నేతలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతుల ఆందోళనకు ఆర్థిక సాయం చేశారనే కారణంతో దేశంలోని మెజారిటీ తపాలా ఉద్యోగుల మద్దతు ఉన్న ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఎఐపిఇయు), నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ (ఎన్‌ఎఫ్‌పిఇ)ల గుర్తింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (సర్వీస్‌ అసోసియేషన్‌ గుర్తింపు) రూల్స్‌-1993 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం బిఎంఎస్‌ పోస్టల్‌ సంఘం భారతీయ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (బిపిఇఎ) ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిఐటియు ఖండించింది. 1920లో కలకత్తాలో ఏర్పాటైన ఎఐపిఇయు, దేశంలోని పురాతన యూనియన్‌లలో ఒకటి. ఎన్‌ఎఫ్‌పిఇ అనేది ఎఐపిఇయుతో సహా ఎనిమిది పోస్టల్‌ ఉద్యోగుల సంఘాలతో అనుబంధంగా ఉన్న రంగంలో అతిపెద్ద సమాఖ్య. 2021 మార్చి 31న రైతు ఉద్యమానికి రూ.30 వేలను ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గ్రూప్‌ 'సి' ఖాతా నుంచి చెల్లించినట్లు కేంద్రం ఆరోపిస్తోంది. రాజకీయాలకు అతీతంగా రైతుల ఆందోళనకు సహాయ సహకారాలు అందించా లన్న సమాఖ్య వాదనను ప్రభుత్వం అంగీకరించలేదు. ఫెడరేషన్‌, దాని అనుబంధ సంస్థలు రూ.4,935 ఖర్చుచేసి సిపిఎం నుంచి పుస్తకాలు కొనుగోలు చేశాయని, సిఐటియుకి రూ.50 వేలు విరాళంగా ఇచ్చాయని ప్రభుత్వం ఆరోపించింది. దాదాపు రూ.17 లక్షల కోట్ల విలువైన ఆర్థిక సేవల వ్యాపారాన్ని కలిగి ఉన్న పోస్టల్‌ శాఖ కార్యకలాపాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఎన్‌ఎఫ్‌పిఇ ప్రతిఘటించడంతో కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల ఉద్యోగులు సమ్మెకు దిగారు. పదేళ్ల క్రితం, ఉద్యోగుల మధ్య జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 75 శాతం ఓట్లతో ఎన్‌ఎఫ్‌పిఇ ఆమోదించబడింది. అప్పట్లో బిఎంఎస్‌కు ఐదు శాతం ఓట్లే వచ్చాయి. వచ్చే ఏడాది మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుండగా, కేంద్రం ఈ చర్య తీసుకున్నట్లు ఎన్‌ఎఫ్‌పిఇ ప్రధాన కార్యదర్శి పికె మురళీధరన్‌ విమర్శించారు. పోస్టల్‌ శాఖలోని నాలుగున్నర లక్షల మంది ఉద్యోగుల్లో మూడు లక్షల మందికి పైగా ఉద్యోగుల మద్దతు ఎన్‌ఎఫ్‌పిఇకి ఉంది. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సాంప్రదాయ సంఘమని, గుర్తింపు రద్దుపై అన్ని స్థాయిల్లో గట్టిగా పోరాడుతుందని మురళీధరన్‌ తెలిపారు.
 

                                                    పనికిమాలిన కారణాలతో గుర్తింపు రద్దు : సిఐటియు

పనికిమాలిన కారణాలతో నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌ (ఎన్‌ఎఫ్‌పిఇ), ఆల్‌ ఇండియా పోస్టల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గ్రూప్‌-సి గుర్తింపును రద్దు చేసిన కేంద్ర ప్రతీకార చర్యలను సిఐటియు ఖండించింది. ఈ మేరకు శుక్రవారం సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ప్రకటన విడుదల చేశారు. రైతులు, తోటి శ్రామిక ప్రజలకు సంఘీభావం తెలియజేయడమే కాకుండా, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్‌ఎఫ్‌పిఇ తీవ్రంగా ప్రతిఘటిస్తోందని పేర్కొన్నారు. తపాలా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వ ప్రతీకార చర్యలకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసన పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. ఎన్‌ఎఫ్‌పిఇ, ఎఐపిఇయులపై గుర్తింపు రద్దు ఉత్తర్వులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం, పోస్టల్‌ శాఖను సిఐటియు డిమాండ్‌ చేసింది.