ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ : ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ నివేదిక
- దక్షిణాసియాలో అతి పెద్ద ముప్పు వాయు కాలుష్యమే - ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచంలోకెల్లా అత్యంత కాలుష్య నగరంగా న్యూఢిల్లీ నమోదైంది. ప్రస్తుత కాలుష్య స్థాయిలు ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారని ఇటీవల జరిగిన కొత్త అధ్యయనం వెల్లడించింది. చికాగో యూనివర్శిటీలోని ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ గాలి నాణ్యతకు సంబంధించిన జీవన సూచీ (ఎక్యుఎల్‌ఐ)ని విడుదల చేసింది. నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్యంతో మొత్తంగా దక్షిణాసియా ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. దక్షిణాసియాలో ప్రతి వ్యక్తి ఆయుర్దాయంలో ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలాన్ని ఈ కాలుష్యమే హరించివేస్తోంది.
భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజలూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నిర్దేశించిన పరిమితిని దాటిన కాలుష్య ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని ఆ అధ్యయన నివేదిక పేర్కొంది. దేశ జాతీయ గాలి నాణ్యతా ప్రామాణికమైన 40ఎంజి/ఎం3 (క్యూబిక్ మీటర్ గాలిలో 40 ధూళి అణువులు నెలకొనడం) ని అధిగమించిన ప్రాంతాల్లోనే దేశంలోని 67.4శాతం ప్రజలు జీవిస్తున్నట్లు వెల్లడైంది. గాలి కాలుష్యంలో నెలకొన్న సన్నని రేణువుల (పిఎం 2.5) వల్ల సగటు భారతీయుడి ఆయుర్దాయం 5.3 సంవత్సరాలు తగ్గుతోందని అధ్యయనం తెలిపింది. కాలుష్యంతో మగ్గుతున ఢిల్లీ నగరంలో సగటున 11.9 సంవత్సరాల జీవిత కాలాన్ని కోల్పోతున్న వారి సంఖ్య దాదాపు కోటీ 80లక్షలుగా వుందని ఎక్యుఎల్‌ఐ పేర్కొంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రాంతంలో అత్యంత తక్కువగా కాలుష్యం నెలకొన్న ప్రాంతంగా నమోదైంది. అక్కడ కూడా డబ్ల్యుహెచ్‌ఓ పరిమితికి మించి ఏడు రెట్లు ఎక్కువగా కాలుష్యం నెలకొంది. ఇదే స్థాయి కొనసాగితే ప్రజల ఆయుర్దాయంలో 3.1 సంవత్సరాలు కోల్పోతారని అంచనా వేసింది. కేవలం ఆరు దేశాలు - బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, చైనా, నైజీరియా, ఇండోనేషియాల్లో ప్రజలు తాము పీలుస్తున్న గాల్లోని కాలుష్య కారకాల కారణంగా ఏడాది నుండి ఆరేళ్ల వరకు జీవిత కాలాన్ని కోల్పోతున్నారని ఎక్యుఎల్‌ఐ సృష్టికర్త మైఖేల్ గ్రీన్‌స్టోన్ తెలిపారు.










