Jul 13,2022 08:51

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రెండో త్రైమాసికంలో కూడా రాష్ట్రం తీసుకుంటున్న రుణాలు భారీగానే రికార్డయ్యాయి. తొలి త్రైమాసికంలో రూ.21,850 కోట్లు రుణాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించగా, జులై ఒకటి నుంచి ప్రారంభమైన రెండో త్రైమాసికంలో కూడా భారీగానే రుణ సేకరణకు కసరత్తు చేస్తోంది. ఈ త్రైమాసికంలో రూ.25 వేల కోట్లు కావాలని ప్రతిపాదించిన రాష్ట్రం తొలి రెండు వేలంలలో రూ.4 వేల కోట్లు రుణంగా తీసుకోవడం గమనార్హం. ఐదో తేదీన జరిగిన తొలి వేలంలో రూ.వెయ్యి కోట్లు చొప్పున రెండు రుణాలు తీసుకుంది. ఇందులో ఒక రుణాన్ని 18 ఏళ్లకు చెల్లింపు కాల పరిమితితో, రెండో రుణాన్ని 20 ఏళ్ల కాల పరిమితితో తీసుకోవడం గమనార్హం. ఈ రుణాలను 7.95 శాతం, 7.92 శాతం వడ్డీగా తీసుకున్నారు. ఇక మంగళవారం మరో రూ.రెండు వేల కోట్లను రెండు విడతలుగా తీసుకున్నారు. వీటిని కూడా ఒకటి 17 ఏళ్లు, రెండోది 19 ఏళ్లు తిరిగి చెల్లింపు కాల పరిమితితో తీసుకున్నారు. ఇందులో ఒకదాన్ని 7.97 శాతం వడ్డీతో, రెండో దాన్ని 7.92 శాతం వడ్డీతో తీసుకున్నారు.