న్యూఢిల్లీ: చైనా వేదికగా ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల్లో భారత పురుష, మహిళల క్రికెట్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే క్రికెట్‌కు అవకాశం దక్కింది. 2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేసినా.. టీమిండియా పాల్గొనలేదు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, శ్రీలంక క్రికెట్ జట్లు పాల్గొన్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా ఆసియా క్రీడల్లో తమ జట్లు పాల్గొనలేవని అప్పట్లో తెలిపింది. ఈ ఏడాది కూడా ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీలో భాగం కాలేమని బిసిసిఐ ఇప్పటికే నిర్వాహకులకు చెప్పింది. తాజాగా ఆసియా క్రీడలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించాలని భావిస్తున్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. మహిళల జట్టు కూడా ఈ టోర్నీలో పాల్గొననుంది. జూన్ 30లోపు భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు బిసిసిఐ తమ ఆటగాళ్ల జాబితాను పంపనున్నట్లు పేర్కొంది. 'ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషుల, మహిళల జట్టు పాల్గొనబోతుంది. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి టీమ్‌ను బరిలోకి దించాలని నిర్ణయించాం. త్వరలోనే భారత ఒలింపిక్ సంఘానికి ఈ విషయాన్ని తెలియజేస్తాం' అని ఆ అధికారి తెలిపాడు. మరోవైపు ఏషియన్ గేమ్స్ మిషన్ చీఫ్ భూపెందర్ భజ్వా మాత్రం బిసిసిఐ నుంచి స్పష్టమైన సమాచారం రాలేదన్నారు. ఇక చైనాలోని గ్వాంఝు వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు జరగనున్నాయి.










