Oct 02,2023 20:04

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 'సేవ్‌ ది నేషన్‌ - సేవ్‌ డెమొక్రసీ' నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం సేవ్‌ది నేషన్‌-సేవ్‌ డెమొక్రసీ పోస్టరును ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి, వైసిపి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయని, ఈ నెల 3న ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 4న చిత్తూరులో బహిరంగ సభ, 5న మదనపల్లిలో, 6న కడపలో ఉక్కు కర్మాగారం కోసం ప్రత్యేకంగా బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతోపాటు రెండో విడత ఎంబిబిఎస్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వర్గాలకు జరిగిన అన్యాయం వంటి అనేక ప్రజాసంబంధ సమస్యలపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందన్నారు. మీడియా సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.