ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంపోస్టు యార్డు స్థల సమస్యను తక్షణం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి అన్నారు. శుక్రవారం కంపోస్టు యార్డును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... చెత్తను డంపింగ్ చేసేందుకు తెల్లవారు జామున డంపింగ్ యార్డుకు వెళుతున్న కార్మికులకు మధ్యాహ్నం 12 గంటలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉదయం అల్పాహారం కూడా కార్మికులు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణం జేసీబీ పెట్టి డంపింగ్ యార్డు సరిచేయాలన్నారు. గత 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డంపింగ్ యార్డులో చెత్త కొండలా పేరుకుపోయి రోడ్డు మీదకు వచ్చిందని దీంతో చెత్తను యార్డుపైకి తీసుకెళ్లడం కార్మికులకు కత్తిమీద సాములా మారిందన్నారు. స్థల సమస్యను పరిష్కరించకుంటే కార్మికులతో కలిసి ఆందోళన చేపడుతామన్నారు. ఈ యాడ్ రోడ్డు వెంట వెళ్లే కార్మికులు కేవలం రెండు నిమిషాలకి ముక్కు మూసుకుంటుండగా సుమారు 12 గంటల పాటు కార్మికులు ఇక్కడే పనిచేస్తుండడం దారుణమైన పరిస్థితి అన్నారు. ఇక వర్షాకాలం అయితే ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుందని ఇప్పటికైనా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్ కు డంపింగ్ యార్డ్ సమస్యను వివరించారు. జెసిబితో చెత్తను సరి చేస్తామని హామీ అన్నారు.










