Feb 14,2023 21:36

చెన్నై: చెన్నై ఓపెన్‌ ఛాలెంజర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో సుమిత్‌ నాగల్‌ సంచలనం నమోదు చేశాడు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో సుమిత్‌ 6-4, 6-4తో 4వ సీడ్‌, బ్రిటన్‌కు చెందిన రియాన్‌ పెనిస్టన్‌పై సంచలన విజయం సాధించాడు. తొలి సెట్‌లో ముందే ప్రత్యర్ధి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాగల్‌.. రెండు బ్రేక్‌ హ్యాండ్‌ షాట్స్‌తో అలరించాడు. అలాగే నెట్‌వద్దకు దూసుకొచ్చి ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచాడు. ఇక రెండో సెట్‌లోనూ సుమిత్‌ మళ్లీ తొలుతే బ్రేక్‌ సాధించడంతో బ్రిటన్‌ ఆటగాడు చెమటోడ్చినా ప్రయోజనం లేకపోయింది. రెండో సెట్‌లో రియాన్‌ మూడు అనవసర తప్పిదాలు చేయడంతో సుమిత్‌ 5-4 పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లాడు. అంతకుముందు ప్రజ్ఞేశ్‌ గుణ్ణేశ్వరన్‌, ముకుంద్‌ శశికుమార్‌, రామ్‌కుమార్‌ రామనాథన్‌ తొలిరౌండ్‌ పోటీల్లోనే ఓటమిపాలై నిరాశపరిచారు. ప్రజ్ఞేశ్‌ 4-6, 6-3, 6-7(4-7) తేడాతో జే క్లార్డ్‌ చేతిలో ఓడాడు. ఇక రామనాథన్‌ 3-6, 6-7(3-7)తో డిమిట్రార్‌(బెలారస్‌) చేతిలో, శశికుమార్‌ 2-6, 2-6తో ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్‌ పర్సెల్‌ చేతిలో ఓడారు.