Oct 06,2023 21:58

డయల్‌ యువర్‌ ఇఒ'లో యాత్రికుల ఫిర్యాదు
ప్రజాశక్తి-తిరుమల :తిరుమల కొండపై హోటళ్లలో అధిక ధరలను నియంత్రించాలని, అలిపిరి తనిఖీ కేంద్రంలో లోపాలున్నాయని, కొంతమంది తిరుమలలో ధూమపానం చేస్తూ కనబడ్డారని, టిటిడి ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేపడతారని 'డయల్‌ యువర్‌ ఇఒ' కార్యక్రమంలో యాత్రికుల నుంచి ప్రశ్నల పరంపర కొనసాగింది. కార్యక్రమం అనంతరం ఇఒ ఎవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తిరుమల పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ టిటిడికి సహకరించాలని కోరారు. 2050 వరకూ శ్రీవారి ఆర్జిత సేవల అడ్వాన్స్‌ బుకింగ్‌ పూర్తయ్యాయని తెలిపారు. వేలంలో అధిక ధరలకు కోట్‌ చేసి హోటళ్లు పొందుతున్నారని, ఎక్కువ ధరలకు ఆహారం విక్రయిస్తున్నారని, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నమయ్య భవన్‌, నారాయణగిరి ఎపి టూరిజం హోటళ్లు తక్కువ అద్దెకు కేటాయించామని, వీటిని పరిశీలించి ఇతర ప్రాంతాల్లోనూ ఇటువంటివి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఇఒలు వీరబ్రహ్మం, సదాభార్గవి పాల్గన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. టిడిపి ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.