Oct 05,2023 22:10

సెంట్రల్‌ జైలు నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టుకు హాజరు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి:స్కిల్‌ స్కామ్‌లో నిందితునిగా ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఎసిబి కోర్టు ఈ నెల 19 వరకూ రిమాండ్‌ను పొడిగించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన్ని గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరుపర్చారు. చంద్రబాబు తరుపున సీనియర్‌ లాయర్‌ ప్రమోద్‌ కుమార్‌ దూబె వాదనలు వినిపించారు.సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎటువంటి సంబంధమూ లేదని వివరించారు. స్కిల్‌ కార్పొరేషన్‌కు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలు ఏమిటని? న్యాయమూర్తి ప్రశ్నించారు. స్కిల్‌ ప్రాజెక్టు ఆమోదం తెలపడంతోనే సిఎంగా చంద్రబాబుపాత్ర పూర్తయిందని దూబె సమాధానం ఇచ్చారు. సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది స్కిల్‌ కార్పొరేషనే తప్ప ప్రభుత్వం కాదని, స్కిల్‌ కార్పొరేషన్‌, సీమెన్స్‌ ఇండియా, డిజైన్‌ టెక్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని, అక్కడ అవినీతి అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉంటుదని న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబె ప్రశ్నించారు. ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ సిఐడి తరుపున వాదనలు వినిపించారు. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. డొల్ల కంపెనీల నుంచి నిధులు నేరుగా టిడిపి ఖాతాలోకి వచ్చాయన్న ఆధారాలను వివరించారు. రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ఎసిబి కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించిన ఆడిటర్‌ ఈ నెల 10న విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. స్కిల్‌ కుంభకోణంలోచంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని, కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుందని కోరారు. బెయిల్‌ మంజూరు చేయొద్దని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టును కోరారు. ఈ నేపధ్యంలో న్యాయమూర్తి రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.