Oct 13,2023 21:40

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు బరువు తగ్గలేదని, ఒక కేజీ బరువు పెరిగారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ఱారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని స్టార్‌ ఆసుపత్రుల్లో చేర్పించాలనేది టిడిపి నేతల స్కెచ్‌ అని, అందుకే చంద్రబాబు ప్రాణాలకు ముప్పు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. షర్ట్‌ కూడా విప్పని చంద్రబాబుకు ఉక్కపోతతో స్కిన్‌ ర్యాషెస్‌ వచ్చాయని, వైద్యులు అవసరమైన అన్ని ఔషధాలు అందిస్తున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని జైళ్లశాఖ డిఐజి స్వయంగా చెప్పారన్నారు. జైలులో ఎసిలు పెట్టడానికి జైలు మీ అత్తగారిల్లా? డీ హైడ్రేషన్‌ ఏమైనా ప్రాణాంతకమా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు డీ హైడ్రేషన్‌ వచ్చిందని నిన్న మొదలు పెట్టి, నేడు దానికి పరాకాష్టగా తన తండ్రికి స్టెరాయిడ్స్‌ ఇచ్చి చంపే ప్రయత్నం చేస్తున్నారని లోకేష్‌ ట్వీట్‌ చేశారన్నారు. కక్షసాధింపు చర్యలు తమకు అలవాటు లేదని అన్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో చంద్రబాబును సిఐడి అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టిందని, వాటిని పరిశీలించిన అనంతరమే రిమాండ్‌కు పంపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు స్కామ్‌ను వెలికితీశాయని చెప్పారు. అసలు విషయాలను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు అరెస్టుకు రాజకీయ ఉద్ధేశాలు ఆపాదిస్తున్నారని ఆరోపించారు.