పోలవరం పరిహారం, పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలి : కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన అనంతరం రాష్ట్ర మంత్రి అంబటి
- మొదటి దశ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసే దిశగా ఉన్నాం : కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన అనంతరం రాష్ట్ర మంత్రి అంబటి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పోలవరం ప్రాజెక్టు పరిహార, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) పూర్తి కాలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పరిహార, పునరావాస ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని అన్నారు. గురువారం నాడిక్కడ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. అనంతరం ఎపి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసిపి ఎంపిలు పిల్లి సుభాష్ చంద్రబోస్, నందిగం సురేష్‌లతో కలిసి మాట్లాడారు. ''కేంద్ర మంత్రిని పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని కోరాను. సాధ్యమైనంత త్వరలోనే పోలవరం సందర్శిస్తానని చెప్పారు. ఎపి ప్రభుత్వం నవంబర్‌లో విశాఖపట్నంలోని నిర్వహిస్తున్న అంతర్జాతీయ నీటిపారుదల, డ్రైనేజీ కాన్ఫెరెన్స్ (ఐసిఐడి)కు రమ్మని కోరా. ఆయన రాజస్థాన్ ఎన్నికలు ఉండటంతో స్పష్టత ఇవ్వలేదు. అలాగే డయాఫ్రం వాల్, పోలవరం నిధులు గురించి చర్చించా'' అని తెలిపారు. ''పోలవరం ప్రాజెక్టు రెండు దశల్లో ఉంటుందని, మొదటి దశ 41.5 మీటర్ల ఎత్తు, రెండో దశ 45.72 ఎత్తు. అయితే మొదటి దశ (41.5 మీటర్లు)కు సంబంధించిన మొత్తం పరిహారం, పునరావాసం (ఆర్ అండ్ ఆర్) పూర్తి చేసే దిశగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం నుంచి రూ.12,911 కోట్లు విడుదల అయితే అన్నీ పూర్తి అవుతాయి. రెండో దశకు సంబంధించిన పునరావాస, పరిహార ప్యాకేజీ చాలా ఎక్కువ అవసరం అవుతుంది'' అని అన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణం జరగకుండానే డయాఫ్రం వాల్ నిర్మించడం వల్ల, వరదలు వల్ల దెబ్బతిన్నదని తెలిపారు. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంలు తమ ప్రభుత్వం హయంలోనే పూర్తి చేశామని, ఇప్పుడు వరదల వల్ల నష్టమేమీ జరగదని అన్నారు. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్ మరమ్మత్తులు చేయాలా? లేక కొత్త డయాఫ్రం వాలు కట్టాలా? అని చర్చ జరుగుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు, నిపుణులు కొత్త డయాఫ్రం వాలు కట్టాలని ఆలోచనతో ఉన్నారని, అయితే సిడబ్ల్యుసి, పిపిఎ ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాల్సి ఉందని అన్నారు. డయాఫ్రం వాల్ ఒక్కటే కాదని, వాల్‌కి ముందు, వెనుక భాగాల్లో ఇసుక కొట్టుకుపోయి పెద్ద పెద్ద అగాధాలు ఏర్పాడ్డాయని, వాటిని పూడ్చడానికి అదనంగా రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. తమ హయంలో గైడ్ బండ్ కుంగడం లాంటి చిన్న తప్పిదం జరిగిందని, దాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే గైడ్ బండ్ ఒరిజినల్ డిజైన్‌లో లేదని, తరువాత స్పిల్‌వే వద్ద సమస్య వస్తుందేమోనని జత చేశారని చెప్పారు. రాయలసీమ పర్యటన చేస్తున్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎన్ని ప్రాజెక్టులు కట్టారని ప్రశ్నించారు. బ్రో సినిమాకు పవన్ కల్యాణ్ ఎంత పారితోషికం తీసుకుంటారో బహిరంగంగా ప్రకటించాలని, అప్పుడు పారదర్శకంగా ఉన్నట్లు అని అన్నారు.










