- తెల్లవారుజాము నుంచే ప్రారంభం
ప్రజాశక్తి-అమరావతి : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే వివిధ మార్గాల్లో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు తాజా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి కార్ల ర్యాలీ తీశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఎవరికి వారు తమ కార్లు తీసుకొని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎస్ ఆర్ నగర్, ఎల్బీనగర్ రోడ్ల ప్రాంతాల నుంచి బయలుదేరారు. వీరంతా రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు. అక్కడ శిబిరంలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వీరంతా కలవనున్నారు. ఆమెకు సంఘీభావం తెలపునున్నారు.
కార్ల ర్యాలీకి పర్మిషన్ లేదు
ఐటీ ఉద్యోగులు నిర్వహిస్తున్న కార్ల ర్యాలీకి పర్మిషన్ లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. కాబట్టి ర్యాలీలకు పర్మిషన్ లేదని విజయవాడ పోలీసు కమిషనర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ ర్యాలీ ను అడ్డుకునేందుకు ఏపీ - తెలంగాణ బార్డర్ లో పలు చోట్ల చెక్ పోస్టులు పెట్టారు. పోలీసుల బలగాలు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి.










