ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ఆటోను, కారు ఢీకొట్టడంతో ఐదు సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చీరాల కారంచేడు రోడ్డులో శుక్రవారం ఉదయం జరిగింది. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుండి శుభకార్యం నిమిత్తం చీరాల వాడరేవు సముద్ర స్నానానికి ప్రయాణికులతో వస్తున్న తమ ఆటోను అదే మార్గంలో ప్రయాణిస్తున్న కారు వెనుక వైపు నుండి ఓవర్ టెక్ చేస్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహ్మద్ ఉబెద్ (5) పైన ఆటో ఒక్క సారిగా తిరగబడడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. పరిస్థితి గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం చీరాల ఏరియా వైద్యశాలలో గాయపడినవారికి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో ఆటో పైకి కారు దూసుకుపోవడంతో ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










