ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో, గాజువాక విలేకరి, శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కొల్లి సత్యనారాయణ (84) శనివారం రాత్రి విశాఖలోని కెజిహెచ్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. విశాఖ పెదవాల్తేరులోని తన మనుమరాలి ఇంట్లో కొద్దిరోజులుగాఉంటున్నారు. శుక్రవారం రాత్రి అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. శనివారం సాయంత్రం వరకూ అక్కడే చికిత్స పొందారు. అయినా, పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడంతో విశాఖ కెజిహెచ్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి 9.30 గంటలకు సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, విశాఖ, అనకాపల్లి జిల్లాల కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, కె.లోకనాథం, సమైక్య అపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వెంకటేశ్వరరావు సంతాపం ప్రకటించారు. సత్యం మాస్టారి సంతాప సభ ఆదివారం 9 గంటలకు విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని తోకాడ సమైక్య అపార్టుమెంట్ వద్ద జరగనుంది. అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్ర బయలుదేరి చినగంట్యాడ వరకూ సాగనుంది.
ఉద్యమ ప్రస్థానం
సత్యం మాస్టర్‌గా అందరికీ పరిచయమైన కొల్లి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1940 మార్చి 20న జన్మించారు. వ్యవసాయ శాఖ ఉద్యోగిగా శ్రీకాకుళం జిల్లా మందస వచ్చారు. తర్వాత పలాస మండలం బొడ్డపాడు స్కూల్‌లో ఉపాధ్యాయునిగా చేరారు. 1961 ఉమ్మడి కమ్మూనిస్టులో చేరారు. ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సరోజినిని 1964లో ఆయన ఆదర్శ వివాహం చేసుకున్నారు. చౌదరి తేజేశ్వరరావు, పంచాది కృష్ణమూర్తి, తామాడ గణపతి తదితరులతో పార్టీలో కలిసి పనిచేశారు. బొడ్డపాడులో పనిచేస్తున్న సమయంలో ఉద్దానం ప్రాంతంలో సాగుతున్న శ్రీకాకుళం గిరిజనోద్యమం వైపు వెళ్లారు. ఉద్యోగం కోల్పోవడంతోపాటు 1968 నుంచి 74 వరకూ ఆరేళ్లుపాటు జైలులో నిర్బంధించబడ్డారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో మళ్లీ 19 నెలలు జైలులో నిర్బంధించబడ్డారు. మందస ప్రాంతంలో సిపిఎం, ట్రేడ్ యూనియన్ నిర్మాణానికి కృషి చేశారు. 1991లో సిపిఎం శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. సోంపేటలో పార్టీ నిర్మాణానికి కృషి చేశారు. తనకున్న పరిచయాలతో మందస, బారువ, బూరగాం, మామిడిపల్లి ప్రాంతాల్లో జనాలను కూడగట్టి పార్టీ నిర్మాణానికి విశేష ప్రయత్నం చేశారు. 1998లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికై సిపిఎంకు సేవలందించారు. అనారోగ్య కారణాలతో 2014లో జిల్లా కమిటీ నుంచి ఆయన రిలీవ్ అయ్యారు
కుటుంబ నేపథ్యం
భార్య సరోజిని ఉపాధ్యాయినిగా ఉంటూ యుటిఎఫ్‌లో పని చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఐద్వా జిల్లా కార్యదర్శిగా మహిళల సమస్యలపై ఆమె పోరాడారు. సత్యం మాస్టర్‌కు అజేయకుమారి, విజయకుమారి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నమ్మాయి, అల్లుడు మరణించారు.
నేటి తరం కమ్యూనిస్టులకు ఆదర్శం
కమ్యూనిస్టు విలువలు, పని పద్ధతుల విషయంలో సత్యం మాస్టర్ నేటి తరం కమ్యూనిస్టులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన చివరి వరకూ సైద్ధాంతిక నిబద్ధతతో పార్టీ కోసం పని చేశారు. చివరి వరకు నిరాడంబర జీవితాన్ని గడిపారు.










