- చంద్రబాబుపై కేసు కేంద్రానికి తెలియకుండా జరిగింది కాదు
- రాజకీయ లబ్దికోసమే మహిళా బిల్లు
- రాష్ట్రపతిని పదేపదే అవమానిస్తున్న ప్రధాని, ఆర్‌ఎస్‌ఎస్
- ఎన్నికలు సమీపించే కొద్దీ మతాల మధ్య వైషమ్యాలు
ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలో వైసిపి, టిడిపి కేంద్రంలో బిజెపికి మద్దతు ఇస్తున్నాయని, ఇది దురదృష్టకర పరిణామం అని, ఎన్‌డిఏలో ఉన్న అనేక పార్టీలు బయటకు వస్తున్నాయని, అయినా ఈ రెండు పార్టీలూ కళ్లు తెరవడం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఏం.ఏ బేబీ, బి.వి.రాఘవులు తెలిపారు. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి వారు మాట్లాడారు. ప్రధాని మోడీ.. మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు గత్యంతరం లేక మద్దతు ఇచ్చాయని, స్వతహాగా ఇష్టం లేదని చెబుతున్నారని అన్నారు. వాస్తవంగా గతంలో మహిళా బిల్లును పెడుతున్న సమయంలో ఇదే బిజెపి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప అందరూ ఆమోదిస్తే దాన్ని పార్లమెంటు విజయంగా చెప్పకుండా బిజెపి తన స్వంత గొప్పదనంగా చెప్పడం అసహ్యంగా ఉందన్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోడీ ఇప్పటి వరకూ ఎందుకు మహిళా బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు. బిల్లు ఆమోదించినా 2029 నుండి అమలు చేయాలని చెప్పడం మోసం చేయడమేనని తెలిపారు. నిజంగా అమలు చేయాలనుకుంటే ఇప్పటి నుండే అమలు చేయొచ్చని, కానీ బిజెపికి అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. 2029 నుండి అమల్లోకి వచ్చేటట్లయితే ఇప్పుడు బిల్లు పెట్టడం రాజకీయ లబ్దికోసం తప్ప మరొకటి కాదని తెలిపారు. అయితే వెంటనే అమలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలంటే అప్పుడున్న సంఖ్యను 33 శాతం ప్రకారం విభజించి అమలు చేయొచ్చని కోరారు. దీనిపై బిజెపి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని, ప్రతిపక్షాలను విమర్శించాల్సిన పనీ లేదని అన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో బిజెపి ఎంపి రమేష్ బిదూరి సోదర ఎంపి రమేష్‌డాలీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. టెర్రరిస్టుగా ముద్ర వేశారని, మత పరమైన అంశాలను ప్రస్తావించి అవమానించారని తెలిపారు. మాట్లాడకూడని పదాలు మాట్లాడారని అయినా దానిపై క్షమాపణ చెప్పలేదని, రాజకీయ పార్టీగా బిజెపి వైషమ్యాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దీనిపై అసలు ఎంపి ఏమీ మాట్లాడటలేదని, రాజ్‌నాథ్ సింగ్ స్పందించారని అన్నారు. దీని వెనుకల మతపరమైన విభజన తేవాలనే కుట్ర దాగుందన్నారు. మతాల మధ్య విభజన సృష్టించి ఎన్నికల్లో గెలుపొందాలనే ఆలోచన ఉందని తెలిపారు. మరోవైపు ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ ఓడిపోతున్నారన్నారు. ప్రజలు బిజెపి వైషమ్యాలను గమనిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఎన్‌డిఏ నుండి ఎఐఏడిఎంకే కూడా వైదొలగిందని తెలిపారు. 2024లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆ ఎన్నికలను కూడా జమిలీ ఎన్నికల పేరుతో అక్కడ కూడా తనకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకోవాలనే చర్చ చేస్తోందని తెలిపారు. సందర్భానుసారం జమిలి ఎన్నికలు రావడం వేరని, ఒకేసారి జరపాలని చట్టబద్ధం చేసి జమిలి ఎన్నికలు జరపాలని చూడటం ప్రమాదకరం, అప్రజాస్వామికం, నిరంకుశమని తెలిపారు. సరైంది కాదని అన్నారు. ఇటువంటి నియంతృత్వ పద్ధతులను సిపిఎంగా తాము అంగీకరించడం లేదని తెలిపారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో వైసిపి, టిడిపి ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లోగానీ, అంతకుముందు సమావేశాల్లోగానీ వైసిపి నాయకులు మోడీని పొగడటంలో తలమునకలు అయ్యారని, ఢిల్లీ బిల్లులోనూ కేంద్రానికి మద్దతు ఇచ్చారని తెలిపారు. టిడిపి కూడా బిజెపికి మద్దతు ఇస్తోందని తెలిపారు. వైసిపి, కేంద్రం కలిసి చంద్రబాబును అరెస్టు చేయించారని వార్తా పత్రికల్లోనూ కథనాలు వస్తున్నాయని అన్నారు. కేంద్ర నిఘా సంస్థల సూచనల మేరకే తాము చర్యలు తీసుకుంటున్నామని సిఐడి కూడా నివేదికలో పేర్కొందని తెలిపారు. అర్థరాత్రి పోయి అరెస్టుచేసి ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏమిటని అన్నారు. ఈ పద్ధతుల్లో చంద్రబాబును అరెస్టు చేయడం వేధింపు అనుకోవాల్సి వస్తుందని అన్నారు. అయితే తప్పుచేశారా లేదా అనేది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. దేశం కోసం ఇక్కడ పార్టీలు కూడా పునరాలోచన చేయాలని, బిజెపికి దూరంగా జరగాలని కోరారు. బిజెపికి దగ్గరగా ఉండే రాజకీయ పార్టీలను నాశనం చేసి బిజెపి ఎదుగుతోందని వారు గమనిస్తే మంచిదని అన్నారు.
ప్రధాని మోడీకి రాజ్యాంగపట్ల గౌరవం లేదని అన్నారు. ఆయన ఇటీవల ప్రత్యేక సమావేశాలు నిర్వహించారని, ఇటీవల సావర్కర్ పుట్టినరోజున పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారని, ఆ సమయంలో రాష్ట్రపతిని కూడా భాగస్వామిని చేయలేదని అన్నారు. ఇండియన్ పార్లమెంటు అంటే ఉభయ సభలు, రాష్ట్రపతిని, కానీ మోడీ దాన్ని గౌరవించకుండా ఆయనే ప్రారంభించారని తెలిపారు. అయినా అందులో సమావేశాలు నిర్వహించకుండా పాత భవనంలోనే నిర్వహించారని, అంటే అది పూర్తిగా నిర్మాణం కాలేదని తెలిపారు. ప్రస్తుత సమావేశాలు పాత భవనంలోనే జరుగుతున్నాయని, అందులోనే పార్లమెంటు ప్రాశస్త్యంపై చర్చించారని, వెంటనే కొత్త భవనంలో సమావేశాలు నిర్వహించారని తెలిపారు. అందులోనూ రాష్ట్రపతిని పట్టించుకోలేదని తెలిపారు. పార్లమెంటుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ద్రౌపదిముర్మును పట్టించుకోలేదని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ప్రకారం ఆమె మహిళ కావడం, రెండోది గిరిజన తరగతులకు చెందిన మహిళ కావడటవంతో ఆమెను భాగస్వామ్యం చేయలేదని తెలిపారు. మోడీ పూర్తి నియంతృత్వంగా వ్యవహరిస్తూ చట్టాలు చేసే సమయంలో కనీసం ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని తెలిపారు. పూర్తి నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు.
అసాంఘిక శక్తుల పేరుతో ఉద్యమాలను అణచడం సరికాదన్నారు.
అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం దారుణంగా వ్యవహరించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. ధర్నా చేసుకుంటామంటే అనుమతి ఇవ్వకపోగా దీనిలో అసాంఘిక శక్తులు జొరపడతారని పోలీసులు ప్రచారం చేశారని తెలిపారు. నగరంలో జరిగిన ఆందోళనలో ఎక్కడైనా సంఘ విద్రోహశక్తులు జొరపడినట్లు గుర్తించారా అని ప్రశ్నించారు. దీనిపై పోలీసులు క్షమాపణ చెప్పాలన్నారు. గత పదేళ్లలో ఎప్పుడ్కెనా సంఘ విద్రోహశక్తులను గుర్తించారా అన్నది చెప్పాలని తెలిపారు. ఒకవైపు మహిళలపై అమానుషాన్ని ప్రయోగించి అసెంబ్లీలో మంత్రులు ఉషశ్రీచరణ్, రోజా మహిళలకు సాధికారిత ఇస్తామని ప్రకటిస్తున్నారని ఎవరిని మోసం చేయడానికో చెప్పాలని డిమాండు చేశారు. వైసిపి అంగన్‌వాడీలను మోసం చేసిందని అన్నారు. పక్కనున్న తెలంగాణాలో వారికి ఎక్కువ వేతనం ఇస్తున్నారని, ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయమంటే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలకు న్యాయం చేసే అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని కోరారు.










