- రాష్ట్ర స్థాయిల్లోనే కూటములు
- సిమ్లా సమావేశానికి మరిన్ని పార్టీలు చేరతాయి
- మీడియా సమావేశంలో సీతారాం ఏచూరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 'ప్రతి రాష్ట్రంలోని పరిస్థితి భిన్నంగా ఉంటుంది. రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా చర్చలు రాష్ట్రస్థాయిల్లో జరగాలని నిర్ణయించాం. అందుకనుగుణంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుంది. రాష్ట్ర స్థాయిల్లోనే కూటములు ఏర్పాటు చేస్తాం. తమిళనాడు, బీహార్, మహారాష్ట్ర వలే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల అవగాహనలు ఉంటాయి' అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో సిపిఎం కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పొలిట్ బ్యూరో సమావేశం తీసుకున్న నిర్ణయాలను సీతారాం ఏచూరి వివరించారు. పాట్నాలో జరిగిన సమావేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు. సిమ్లాలో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి మరిన్ని పార్టీలు చేరతాయన్నారు. రాజ్యాంగ హక్కులపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, విద్వేష, టెర్రర్ రాజకీయాలను వ్యతిరేకించడం, ప్రజాస్వామ్య హక్యులు, మానవ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రచారోద్యమం నిర్వహించాలని ఆ సమావేశంలో నిర్ణయించామన్నారు. దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. ప్రజా జీవనోపాధి సమస్యలైన అంతులేని నిరుద్యోగం, ధరలు పెరుగుదలతో ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. గత రెండేళ్లలో ఒక శాతం కార్పొరేట్ల వద్ద 40 శాతానికి పైబడి సంపద కేంద్రీకృతమైందని, అట్టడుగున ఉన్న 50 శాతం మంది ప్రజల వద్ద కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉందని, ఆ రకంగా ఆర్థిక అసమానతలు పెరిగాయని తెలిపారు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. ఈ సమస్యలపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు.
మణిపూర్‌లో బిజెపి మతోన్మాద ఎత్తుగడలను ఆపాలని, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని, అయితే ఇదే బిజెపి గతంలో జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై అఖిలపక్షాన్ని పంపాలని డిమాండ్ చేసిందని తెలిపారు.
ప్రధాని మోడీ విదేశాల్లో ఉంటే గాంధీ, ఇండియాలో ఉంటే గాడ్సే అని విమర్శించారు. మోడీ అమెరికా పర్యటనలో దేశ ప్రయోజనాలు లేవని, ఇప్పటికే ఉన్న ఒప్పందాలనే తిరగదోడారని విమర్శించారు. మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకు లా కమిషన్ యూనిఫాం సివిల్ కోడ్‌పై మళ్లీ సంప్రదింపులు ప్రారంభించిందని, ఇప్పటికే 2016 నుంచి 2018 వరకు రెండేళ్లు గత లా కమిషన్ సంప్రదింపులు జరిపిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు లా కమిషన్ సంప్రదింపుల్లో అర్థం లేదని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌ను రుద్దొద్దని హితవు పలికారు. మహిళలతో సహా పౌరులందరికీ సమానత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారని, ఇప్పుడు ఆర్‌బిఐ ఉత్తర్వులతో ప్రజల పొదుపులను దోపిడీ చేసేందుకు చట్టబద్ధత కల్పిస్తున్నారని విమర్శించారు. రుణాలు చెల్లించే సామర్థ్యమున్నప్పటికీ, రుణాలు చెల్లించటం లేదని, వారికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రాలకు బియ్యం సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తుందని, కానీ అదే పథకాన్ని రాష్ట్రాలు అమలు చేస్తే అనుమతించటం లేదని విమర్శించారు. రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం పనికిరాదని హితవు పలికారు.










