Sep 17,2023 21:49

20 నుంచి 29 వరకూ ఉత్తరాంధ్ర బైక్‌ యాత్ర
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోడానికి సిపిఎం క్షేత్ర స్థాయిలో కార్యాచరణలోకి దిగుతోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై అనుసరిస్తోన్న వైఖరిని వాడవాడలా ప్రజలకు తెలియజేసేందుకు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఇప్పటికే గట్టిగా నిలబడుతూ నైతికంగా ఉక్కు కార్మికులకు వెనుదన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యమ ఉధృతిని పెంచేందుకు ఈ నెల 20 నుంచి సిపిఎం ఉత్తరాంధ్ర అంతటా బైక్‌ యాత్ర చేపట్టేందుకు నిర్ణయించింది. ఆ రోజున విశాఖ నగరంలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఈ బైక్‌ యాత్ర ఉదయం పది గంటలకు ప్రారంభమై 29న సాయంత్రం స్టీల్‌ప్లాంట్‌లో భారీ బహిరంగ సభతో ముగియనుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం ఈ బైక్‌ యాత్రకు నాయకత్వం వహించనున్నారు. ఇదే అంశంపై ఈ నెల 21 నుంచి విశాఖలో ప్రత్యేకంగా మరో బైకు జాతా మొదలవుతుంది. ఇది ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గం ఆధ్వర్యాన 26 వరకూ జరగనుంది.

  • ప్రధాన నాలుగు డిమాండ్లు ఇవే..

ప్లాంట్‌ అమ్మకాన్ని తక్షణం ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలిచ్చి, ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని, ప్లాంట్‌ నిర్వహణకు రూ.5 వేల కోట్లు నిధులివ్వాలన్న డిమాండ్లతో సిపిఎం ఈ ఉక్కు రక్షణ యాత్రను ఆరంభిస్తోంది.

  • ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడిన చరిత్ర సిపిఎం సొంతం

ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన విశాఖపై నయా ఉదారవాద విధానాలతో బిజెపి చేస్తున్న దాడిని తిప్పికొట్టిన చరిత్ర సిపిఎంకు ఉంది. గతంలో హిందుస్థాన్‌ షిప్‌యార్డు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి 2010లో నేవీలో విలీనం చేసేలా, బిహెచ్‌పివి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి భెల్‌లో కలిపేలా కృషి చేసింది. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐ)ని ప్రయివేటీకరించాలని బిజెపి చేసిన ప్రయత్నాలను పోరాడి అడ్డుకుంది. ఈ క్రమంలోనే ఉక్కు రక్షణ బైకు యాత్రకు తాజాగా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ శ్రీకారం చుట్టింది.

  • పార్టీల అవకాశవాదంపైనా ప్రచారం

ఈ బైక్‌ యాత్ర వెళ్తున్న క్రమంలో ఎక్కడికక్కడే స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం బహిరంగ సభలు, సమావేశాలు, వివిధ తరగతుల కార్మికులతో సమాలోచనలు జరగనున్నాయి. కేంద్రంలోని బిజెపి మొండితనం, రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల అవకాశవాద విధానాలపై సిపిఎం ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలోకి దిగి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకునేందుకు సిద్ధం కావడంపై ఇప్పటికే సర్వత్రా చర్చ జరుగుతోంది.