Sep 17,2023 11:36

హైదరాబాద్‌: జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. సీఎం కేసీఆర్‌ వెంట ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ఎంపీ సంతోశ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌ ఉన్నారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భంగా హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17వ తేదీకి ప్రత్యేకత ఉందన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భావించామన్నారు. తెలంగాణ నేలపై పలు సందర్భాల్లో అనేక పోరాటాలు జరిగాయని.. ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డి నిలిచింది తెలంగాణ సమాజమని అన్నారు. ఆనాటి ప్రజల పోరాటాలు జాతి గుండెల్లో నిలిచిపోతాయన్నారు. తెలంగాణలో రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందనన్నారు. న్యాయం, ధర్మం, కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆనాటి సామ్యానుల చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌ వంటి నేతల వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక, తెలంగాణ సాధనతో నా జన్మ సాకారమైందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.