Sep 13,2023 15:07

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 30న ప్రారంభించనున్నట్లు సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షపై బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ రూపొందించిన బ్రోచర్‌ను సిఎం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష తరహాలోనే ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలన్నారు. దీనికోసం ప్రతి ఇంటిని జల్లెడ పట్లాలని చెప్పారు. గుర్తించిన బాధితులందరికీ ఒక రోజు గ్రామంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించి అవసరమైన వారికి పరీక్షలు చేయడంతో పాటు మందులు, కళ్లద్దాలు ఇవ్వాలన్నారు. సురక్షలో ఏరకంగా 98లక్షలకు పైగా సర్టిఫికెట్లు నెల రోజుల వ్యవధిలో అందించామో అదే తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జల్లెడ పట్టిన ప్రతి గ్రామాన్ని ఫ్యామిలీ డాక్టర్‌ పూర్తిగా బాధ్యత తీసుకొవాలని చెప్పారు. ఆ గ్రామాన్ని మ్యాపింగ్‌ చేసి ప్రతి ఇంట్లో ఏ సమస్యలున్నాయనేది తెలుసుకుని విలేజ్‌ క్లినిక్‌ ద్వారా వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి ఏ రకమైన మందులు కావాలి? ఎలాంటి ట్రీట్‌మెంట్‌ జరగాలి అనే అంశంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పెరాలసిస్‌, మరేదైనా సమస్య ఉంటే వారికి రెగ్యులర్‌ మెడిసిన్‌ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి తదుపరి చికిత్స అందించే కార్యక్రమం కూడా నిర్వహించాలన్నారు. నాలుగేళ్ల కాలంలో వైద్యారోగ్యశాఖలో 53,126 పోస్టుల భర్తీ చేశామని అన్ని ఆసుపత్రులను జాతీయస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసినట్లు సిఎం వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిన, సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, సిసిఎల్‌ఎ జి.సాయిప్రసాద్‌, వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ సిఎస్‌ ఎమ్‌టి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరు ఎ మ్‌ జానకి, సిసిఎల్‌ఎ కార్యదర్శి ఎండి ఇంతియాజ్‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జె.నివాస్‌, ఆరోగ్యశ్రీ సిఇఓ హరీందర్‌ ప్రసాద్‌, ఆర్దిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ వెంకట మురళీ, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కమిషనరు పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.