అమరావతి : అగ్రిగోల్డ్ బాధితుల శంఖారావ ధీక్షకు రాకుండా ఎక్కడికక్కడ జిల్లాల్లో అరెస్టు చేసి నిర్భందించటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఖండించారు. బాధితులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ముఖమంత్రిని కోరారు.32 లక్షల కుటుంబాల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. సర్వం కోల్పోయి ఆర్ధిక, మానసిక ఒత్తిడితో కొంతమంది మరణించినా,సంవత్సరాలు గడుస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. అధికారంలోకి రాకముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు కాలేదు. కోర్టు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదన్నారు. మరోసారి బాధితులు తమ సమస్యలను ప్రశాంతంగా ప్రభుత్వం దఅష్టికి తీసుకురావటానికి జింఖానా గ్రౌండ్‌లో శంఖారావ దీక్షను జరపాలని నిర్ణయిస్తే, పోలీసులు ముప్పాళ్ళ నాగేశ్వరరావుతో సహా అనేకమందిని అరెస్టులు చేయడం గర్హనీయమన్నారు. అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 3080 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేసి అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులనుండి జమ చేసుకోవాలి. పలు స్కీముల్లో ఇంటి స్థలాలు, భూములు కొని రిజిష్టరు చేయించుకున్న వారందరవీ స్వాధీనం చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.










