Jul 18,2022 08:00

ప్రభుత్వ దాడులను తిప్పికొట్టండి
ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ మహాసభలో సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో  : 
కేంద్రంలోని మోడీ సర్కార్‌ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరులో విస్తృత ఐక్యత సాధించాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ పిలుపునిచ్చారు. హర్యానాలోని హిస్సార్‌లో రెండు రోజులుగా జరుగుతున్న ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌) 11వ జాతీయ మహాసభలో ఆదివారం ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కెకె దివాకరన్‌ సమర్పించిన నివేదికపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తపన్‌సేన్‌ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, మోటార్‌ వెహికిల్‌ చట్ట సవరణ, కార్మిక చట్టాల స్థానంలో కార్మిక కోడ్‌లు వంటి కేంద్ర ప్రభుత్వ దాడులను వివరించారు. రవాణా రంగం ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమని, అందులో రోడ్డు రవాణా కార్మిక ఫెడరేషన్‌ కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్ర రవాణా సంస్థలను లాభ, నష్టాల ప్రాతిపదికన ప్రపంచంలో ఏ ప్రభుత్వం చూడదని, ఇది మనదేశంలో జరుగుతోందని విమర్శించారు. దేశంలో రాష్ట్ర రవాణా సంస్థల పాత్రను ప్రభుత్వాలు భారీగా తగ్గించాయని, ఈ రంగంలోకి ప్రైవేట్‌ ఆపరేటర్లు వచ్చారని తెలిపారు. ప్రైవేట్‌ రవాణా రంగం రోజురోజుకు విస్తరిస్తోందని, ప్రైవేట్‌ రవాణా కార్మికులను సంఘటితం చేయడానికి ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ దృష్టి పెట్టాలని సూచించారు. కార్పొరేట్లకు సేవ చేసేందుకు కార్మికవర్గం, ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి మతపరమైన, విభజన రాజకీయాలు ఆడుతున్నారని ఆయన హెచ్చరించారు. కార్మిక వర్గం దీనిని గుర్తించి, ఇలాంటి రాజకీయాలను ఓడించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోట్లాది అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం ''సామాజిక భద్రతా చట్టం'' అమలు చేయాల్సిన అవసరంపై తీర్మానాన్ని ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ జాతీయ కార్యదర్శి టికె రాజన్‌ ప్రవేశపెట్టగా, సంఘం వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ముస్తాద్‌ అహ్మద్‌ఖాన్‌ బలపరిచారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.