అమరావతి : చికెన్ బిర్యానీకి ఉన్న క్రేజే వేరు... అందులోనూ హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడని వారుండరు.. ప్రస్తుతం ఎన్నో రకాల నాన్‌వెజ్ వంటకాలు వచ్చినా.. చికెన్ బిర్యానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. భారతీయులలో ఎక్కువమంది బిర్యానీ ప్రియులని.. ఇప్పటికీ ఆర్డర్లపరంగా అదే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నిర్వహించిన సర్వేలో రుజువయ్యింది.

ఏడు ప్రముఖ నగరాల సర్వేలో బిర్యానీనే టాప్..
కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా, దేశంలోని ఇతర నగరాల్లోనూ బిర్యానీ టాప్‌గా నిలిచింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ.. చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది నగరవాసులు స్విగ్గీ యాప్ లో ... ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ చేసారో తెలుసా ? హైదరాబాద్ బిర్యానీ (చికెన్)..! కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా.. దేశంలోని ఏడు ప్రముఖ నగరాలపై స్విగ్గీ ఈ సర్వే చేపట్టింది. కాగా.. ఈ ఏడు నగరాల్లోనూ ఎక్కువ మంది చికెన్ బిర్యానీకే ఓటు వేయడం విశేషం. బిర్యానీ తర్వాత మసాలా దోశ, బటర్ నాన్, తందూరీ రోటీ, పనీర్ బటర్ మసాలా ఈ ఏడాది టాప్ ఫుడ్స్ గా నిలిచాయి.

ఈ రికార్డు ఏడోసారి.. సెకనుకు 2.28 చికెన్ బిర్యానీ ఆర్డర్లు..!
స్విగ్గీ యాప్‌లో భారతీయులు ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారం చికెన్ బిర్యానీనేనట..! 2022లో తమకు వచ్చిన ఆర్డర్లకు సంబంధించిన వార్షిక నివేదికను స్విగ్గీ విడుదల చేసింది. ఈ నివేదికలో బిర్యానీకి టాప్ ప్లేస్ దక్కడం వరుసగా ఇది ఏడోసారి. స్విగ్గీ-2022 నివేదిక ప్రకారం ఆ యాప్‌లో సెకనుకు 2.28 చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి.
నిముషానికి 137 బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ..!
నిమిషానికి 137 బిర్యానీ ప్యాకెట్లను స్విగ్గీ డెలివరీ చేస్తుందట. ఇక, చికెన్ బిర్యానీ తర్వాత వరుసగా మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్‌ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.
చిరుతిండ్లలో సమోసా టాప్..!
ఇక విదేశీ వంటకాల విషయానికొస్తే ... ఇటాలియన్ పాస్తా, పిజా, మెక్సికన్ బౌల్, స్పైసీ రొమెన్‌ను భారతీయులు అత్యధికంగా ఆర్డర్ చేశారు. చిరుతిండ్లు (స్నాక్స్) కేటగిరీలో సమోసా టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2022లో సమోసాల కోసం స్విగ్గీకి 40 లక్షల ఆర్డర్లు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో, పాప్‌కార్న్, పావ్ బాజీ, ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ నిలిచాయి. అత్యధికంగా ఆర్డర్ చేసిన డిసర్ట్స్‌లో గులాబ్ జామూన్, రస్‌మలాయి, చాకోలావా కేక్, రసగుల్లా, చాకోచిప్స్ ఐస్‌క్రీమ్ వరుసగా టాప్-5లో నిలిచాయి.










